Double bedroom House : GHMC పరిధిలో 11,700 డబుల్ బెడ్‌రూం ఇండ్లు - ఇవాళే లబ్ధిదారులకు పంపిణీ
02 September 2023, 8:25 IST
- Double Bedroom Houses in GHMC:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ 111,700 ఇళ్లను పేదలకు ఇవ్వబోతోంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇవాళ 11,700 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
Double Bedroom Houses in GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణం పూర్తయిన దాదాపు 70 వేల ఇండ్లను అర్హుల పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా 24 నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు శనివారం ఒక్కరోజే 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి 9 ప్రాంతాల్లో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించనున్నారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా ఈ ఇండ్ల పంపిణీ జరుగుతుంది.
ఎక్కడ పంపిణీ చేస్తారంటే..
-కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ 1,700 గృహాలను పంపిణీ చేస్తారు. గాజుల రామారంలో నిర్మించిన 144, బహదూర్‌పల్లిలో నిర్మించిన 356 ఇండ్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు.. డీ-పోచంపల్లిలో నిర్మించిన 1,200 గృహాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 200 మంది, సనత్‌నగర్ నియోజకవర్గంలోని 500 మంది, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
-బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గ లబ్ధిదారులకు, ఫారూఖ్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాలను బహదూర్‌పుర నియోజకవర్గ లబ్ధిదారులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు.
-నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇండ్లతోపాటు నార్సింగి సర్వే నంబర్ 117లో నిర్మించిన 196 గృహాలను రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
-నల్లగండ్ల సర్వేనంబర్ 125లో నిర్మించిన 216 గృహాలతోపాటు, సాయినగర్ హఫీజ్‌పేటలో నిర్మించిన 168 ఇండ్లను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
-పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్‌పూర్-2లో నిర్మించిన 3,300 గృహాలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1లో నిర్మించిన 1,500 ఇండ్లను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మందికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 156 మందికి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 144 మందికి, పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అమీన్‌పూర్-2లో నిర్మించిన 1,800 ఇండ్లను గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కార్వాన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మందికి అందజేయనున్నారు.
-మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1,500 ఇండ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 500 మందికి, ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేయనున్నారు.
-ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 710/పీలో నిర్మించిన 500 గృహాలను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పంపిణీ చేయనున్నారు. -వీటిని ఉప్పల్ నియోజకవర్గ లబ్ధిదారులకు అందజేయనున్నారు.
మేడ్చల్ పరిధిలోని ప్రతాప్‌సింగారంలో వెయ్యి ఇండ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, అంబర్‌పేటకు చెందిన మరో 500 మందికి ఈ గృహాలను అందజేయనున్నారు.