HMDA Permissions : వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు - ఏ అధికారి దగ్గరైనా సరే 10 రోజులే గడువు..!
27 November 2024, 11:30 IST
- భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల ప్రక్రియపై HMDA కీలక ప్రకనట చేసింది. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ఈ మేరకు పలు ముఖ్య వివరాలను ప్రస్తావించింది.
HMDAలో శరవేగంగా అనుమతుల ప్రక్రియ
భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల కోసం వచ్చే అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించేదిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు HMDA స్పష్టం చేసింది. ఏ ఒక్క అధికారి దగ్గరైనా సరే 10 రోజులకు మించి నిలిపివేయకుండా ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతుందని వచ్చిన వార్తలను తోసిపుచ్చింది.
హెచ్ఎండీఏలో అప్లికేషన్ల సంఖ్య చాలా తగ్గిందని, వాటి క్లియరెన్స్ ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతున్నదని పలు వార్తలు వచ్చాయని… కానీ అవేమి నిజాలు కాదని HMDA స్పష్టం చేసింది. అనుమతుల ప్రక్రియ గతంలో పోలిస్తే వేగవంతమైందని తెలిపింది. అధికారుల నుంచి ఎలాంటి వివరాలు తీసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదని పేర్కొంది.
గతడాదితో పోలిస్తే అప్లికేషన్ల సంఖ్య కూడా పెరిగిందని హెచ్ఎండీఏ వెల్లడించింది. నిత్యం సమీక్షలతో వాటిని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తోందని గుర్తు చేసింది. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం జరుగడం లేదని తెలిపింది.
హెచ్ఎండీఏ ప్రస్తావించిన కీలక అంశాలు:
- 2023తో పోలిస్తే పెరిగిన కొత్త అప్లికేషన్ల సంఖ్య పెరిగింది.
- 2023 జూన్- అక్టోబర్ మధ్యతో పోలిస్తే 39 శాతం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి.
- 2023తో పోలిస్తే ఈ ఏడాది 14.4 శాతం పెరిగిన అప్లికేషన్ల పరిష్కారం లభించింది.
- HMDAకు వచ్చిన అప్లికేషన్లపై ప్రతి వారం సమీక్ష జరగుతుంది.
- ప్రతి బుధవారం ప్రత్యేకంగా అధికారుల వారీగా దరఖాస్తుల పరిష్కారంపై మెట్రోపాలిటన్ కమిషనర్ సమీక్షిస్తున్నాం.
- ప్రతి ఫైల్ పై ప్రత్యేకమైన శ్రద్ధ, ఏ ఫైల్ అయినా సరే ఏ ఒక్క అధికారి దగ్గర 10 రోజులకు మించి నిలిపివేయకుండా చర్యలు చేపట్టాం.
- పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు అక్టోబర్ చివరి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఫలితంగా పెండింగ్ అప్లికేషన్ల లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
- 2023 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు 1356 కొత్త అప్లికేషన్ల స్వీకరణ జరిగింది.
- 2024 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏకంగా 1884 అప్లికేషన్లు అందాయి.
- గతేడాదితో పోలిస్తే ఏకంగా 39 శాతం ఎక్కువగా దరఖాస్తుల స్వీకరణ జరిగింది.
- 2023 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిష్కరించిన అప్లికేషన్లు 2038.
- 2024 సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు 2332 అప్లికేషన్లకు పరిష్కారం.
- గతేడాదితో పోలిస్తే 14.4 శాతం ఎక్కువగా దరఖాస్తుల పరిష్కారం.
- 2023 నవంబర్ లో 267 కొత్త అప్లికేషన్లు వస్తే 2024 నవంబర్ 16 వ తేదీ వరకు వచ్చిన కొత్త అప్లికేషన్లు 208. గతేడాదితో పోలిస్తే 46.1 శాతం వృద్ధి నమోదైంది.
- 2023 నవంబర్ లో పరిష్కరించిన అప్లికేషన్ల సంఖ్య 427గా ఉంటే.. 2024 నవంబర్ 16వ తేదీ వరకు పరిష్కరించిన అప్లికేషన్ల సంఖ్య 304గా ఉందని HMDA వివరించింది.