Godavari Floods : భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
09 August 2022, 18:28 IST
- ఇటీవలే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఇంకా అప్పటి పరిస్థితుల నుంచి కోలుకోకముందే మళ్లీ గోదావరి నదికి వరద క్రమక్రమంగా పెరగడంతో ఆందోళన మెుదలైంది. తాజాగా భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గోదావరి వరదలు
కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఎగువన ఉన్న ప్రాంతాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదికి మళ్లీ వరద పెరుగుతోంది. ఈ కారణంగా అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో మళ్లీ ఆందోళన మెుదలైంది. సోమవారం 35 అడుగులు ఉన్న నీటిమట్టం.. మంగళవారం మధ్యాహ్నానికి 41.2 అడుగులకుపైగా ఉంది. తాజాగా 43 అడుగులపైగా గోదారమ్మ ప్రవహిస్తోంది. దీంతో వెంటనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో క్రమక్రమంగా గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం నుంచి పెరుగుదల ఉంది. దీంతో అధికారులు స్థానికులు ముందుగానే అలర్ట్ చేశారు. జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరిలోకి ఎగువ నుంచి 8,56,949 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. స్నానఘట్టాల దాకా నీరు వచ్చింది.
ఇటీవలే గోదావరి నదికి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే వరద వస్తుంది. కానీ ఆ మధ్య కురిసిన వర్షాలతో అన్ని ఉపనదుల నుంచి వరద వచ్చింది. మహారాష్ర్ట, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ప్రాంతాల్లోని పట్టణాలు, పల్లెలు వరదమయమయ్యాయి. భద్రాచలం వద్ద 70 అడుగులకుపైగా వరద నీరు వచ్చింది. కరకట్టను తాకింది. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ప్రాణ నష్టం పెద్దగా జరగకుండా కాపాడారు. ప్రభుత్వం కూడా ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచింది.
1986లో గోదావరి నదికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా కరకట్ట నిర్మించాలని ప్రణాళిక వేశారు. ఆ తర్వాత దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రూ.53 కోట్లతో ఎటపాక నుంచి సుభాష్ నగర్ వరకు 10 కిలోమీటర్ల వరకు ఈ కరకట్టను నిర్మాణం జరిగింది. అయితే ఈ కరకట్టకు లీకేజీ లోపాలు ఉండటంతో నీరు బయటకు వస్తుంది. 36 ఏళ్ల తర్వాత ఇటీవల గోదావరికి భారీగా వరద రావడంతో నీరు కరకట్టను తాకింది. మరోవైపు కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన స్లూయిస్ నుంచి లీకులతో నీరు భద్రాచలంలోకి వెళ్తోందనే అభిప్రాయలు వచ్చాయి.