తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics | గవర్నర్ వర్సెస్ కేసీఆర్ వివాదం ఇంకా ఎక్కువవుతుందా?

Telangana Politics | గవర్నర్ వర్సెస్ కేసీఆర్ వివాదం ఇంకా ఎక్కువవుతుందా?

HT Telugu Desk HT Telugu

22 April 2022, 18:18 IST

google News
    • గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నడుమ మధ్య వివాదం ఇంకా తగ్గినట్టుగా అనిపించండం లేదు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆత్మహత్యలపై టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై.. గవర్నర్ నివేదికలు కోరారు.
గవర్నర్ వర్సెస్ కేసీఆర్
గవర్నర్ వర్సెస్ కేసీఆర్

గవర్నర్ వర్సెస్ కేసీఆర్

తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ నడుమ కొన్నిరోజులు వివాదం నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రులు నేరుగానే.. గవర్నర్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు తమిళి సై ఢిల్లీ వెళ్లి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ మరియు మహారాష్ట్ర వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాల రోజువారీ పనితీరులో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంతగా అంటే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను.. రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధంకర్‌ను తొలగించాలని కోరారు. ఆయన బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి సమయంలో మళ్లీ.. తెలంగాణ గవర్నర్ తమిళి సై.. ఆత్మహత్యలపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో మళ్లీ వివాదం ఎక్కువ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏప్రిల్ 16న ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సామినేని సాయి గణేష్ (25) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు గవర్నర్ లేఖ రాశారు. కామారెడ్డి జిల్లాలోని రామాయంపేట పట్టణంలో గంగం సంతోష్ (40), అతని తల్లి పద్మ (63) ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన పరువు హత్యలు, సామూహిక అత్యాచారం వంటి ఘటనలపైనా.. నివేదికను కోరారు.

'గవర్నర్ వివిధ మీడియా, సోషల్ మీడియా నివేదికలను చూశారు. ఈ సంఘటనలపై బీజేపీ తెలంగాణ నేతలు ఇచ్చిన ఫిర్యాదను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఈ ఘటనలపై వివరణాత్మక నివేదికను కోరారు.' అని రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ రెండు సందర్భాల్లోనూ బాధితులు తమ సూసైడ్ నోట్‌లో స్థానిక టీఆర్ఎస్ నేతల పేర్లు పెట్టారు. రామాయంపేట ఘటనలో స్థానిక మున్సిపల్‌ ఛైర్మన్‌తోపాటు ఆరుగురు టీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను బ్లాక్ చేశారన్న ఆరోపణలను కూడా గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నారు. దీని ఫలితంగా అర్హులైన స్టేట్ ర్యాంక్ హోల్డర్లకు పీజీ సీట్లు నిరాకరించారని రాజ్ భవన్ తెలిపింది.

స్వయంగా వైద్యురాలు కావడం వల్ల గవర్నర్‌ ఈ నివేదికలతో బాధపడ్డారని తెలుస్తోంది. దిద్దుబాటు చర్యలను ప్రారంభించి తక్షణమే సవివరమైన నివేదికను సమర్పించాల్సిందిగా వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించారు. మరోవైపు.. వరంగల్‌లోని మట్వాడ పోలీస్‌స్టేషన్‌లో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లను అడ్డుకున్న కొన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొన్ని కళాశాలల్లో దాదాపు 45 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల పేర్లతో కన్వీనర్ కోటా కింద లేదా నీట్-పీజీ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉచిత సీట్లను బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సీట్లు బ్లాక్ చేయబడిన విద్యార్థుల పేర్లను విశ్వవిద్యాలయ అధికారులు సంప్రదించినప్పుడు, వారు ఎన్నడూ KNRUHS లో అడ్మిషన్ కోరలేదని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు బ్లాక్ చేసిన సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాకు బదిలీ చేసి భారీగా సొమ్ము చేసుకునేందుకు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన అర్హులైన ర్యాంక్ హోల్డర్లకు అడ్మిషన్ నిరాకరించినట్లు ఫిర్యాదు వచ్చింది. KNRUHS పరిధిలో 33 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది ప్రభుత్వ కళాశాలలు, 20 ప్రైవేట్ కళాశాలలు, నాలుగు మైనారిటీ కళాశాలలు.

అయితే కొన్ని వారాలుగా.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా నడుస్తోంది. మళ్లీ ఈ నివేదికల అంశంతో అగ్గి రాజేసినట్టైందని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వారాలుగా తమిళిసై బహిరంగంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రోటోకాల్ ఉల్లంఘింస్తోందని ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నివేదికను సమర్పించారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో కలిసి పనిచేయడం చాలా కష్టమని కూడా తమిళిసై అన్నారు. 'ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు.' అని ఆమె వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఆమె గవర్నర్‌గా కాకుండా బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారంటూ తమిళిసైపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 'గవర్నర్ సంస్థ పట్ల మాకు పూర్తి గౌరవం ఉంది. అయితే ఆమె బీజేపీ నాయకురాలిగా ప్రవర్తించడం మానేయాలి. ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం చాలా కష్టమని ఆమె చెప్పడం తగదు.' అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు.

తదుపరి వ్యాసం