తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections : నేను పక్కా లోకల్ అంటున్న Nri.. టెన్షన్‍లో మాజీ మంత్రి - ఏం జరగబోతుంది..?

TS Assembly Elections : నేను పక్కా లోకల్ అంటున్న NRI.. టెన్షన్‍లో మాజీ మంత్రి - ఏం జరగబోతుంది..?

22 September 2023, 16:48 IST

google News
    • Warangal Congress News : వరంగల్ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తూర్పు టికెట్ పై కన్నేయటంతో…. ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి టెన్షన్ పడుతున్నారట! ఈ సీటు వ్యవహారం ఓరుగల్లు రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. 
వరంగల్ తూర్పు లో టికెట్ల పంచాయితీ
వరంగల్ తూర్పు లో టికెట్ల పంచాయితీ

వరంగల్ తూర్పు లో టికెట్ల పంచాయితీ

Telangana Assembly Elections 2023: మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఆచితూచీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి భారీగానే దరఖాస్తులు రావటంతో… బరిలో నిలిచి గెలిచే నేతలు ఎవరనే దానిపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్… టికెట్ల కేటాయింపు విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగవద్దని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో….వరంగల్ నగర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా తూర్పు సీటుపై మాజీ మంత్రి కొండా సురేఖ గట్టి ఆశలు పెట్టుకున్నప్పటికీ… మరికొందరు నేతలు లైన్ లోకి వచ్చేశారు. ఇప్పటికే సురేఖతో పాటు ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తుండగా… తాజాగా ఎంట్రీ ఇచ్చిన ఓ ఎన్ఆర్ఐ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట…! ఇప్పుడు ఇదే ఓరుగల్లు తూర్పు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం… తెలంగాణ ఏర్పాటు ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ హవా నడవగా… ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. 2014లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మాజీ మంత్రి కొండా సురేఖ… విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవటంతో… ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో మరోసారి కూడా టీఆర్ఎస్సే గెలవగా… కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కొండా సురేఖ ఓటమిపాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి పార్టీ తరపున టికెట్ దక్కించుకోని… ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు కొండా దంపతులు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే సీటు ఖరారు అంశం అంత తేలికగా కనిపించటం లేదు. ఇదే సీటు కోసం కాంగ్రెస్ లో చాలా ఏళ్లుగా పని చేస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ ఆశిస్తున్నారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈమె వరంగల్‍ మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో వరంగల్ మేయర్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది. మహిళా డీసీసీ పదవిని స్వర్ణకు ఇవ్వటంతో కొండా దంపతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తాము సూచించిన వ్యక్తికి కాకుండా… ఎర్రబెల్లి స్వర్ణకు పీఠం దక్కడంపై కొండా దంపతులు గుర్రుగా ఉన్నారు. వీరి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారిగా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో వరంగల్ తూర్పు ఇంఛార్జీగా పని చేసిన సయ్యద్ హుస్సేన్ కూడా ఇదే టికెట్ ను టికెట్ ఆశిస్తున్నారు.

NRI ఎంట్రీ.. టెన్షన్లో కొండా దంపతులు

ఇక ఇటీవలే పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది కాంగ్రెస్. అయితే వరంగల్ తూర్పు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఎన్ఆర్ఐ ప్రదీప్ సామల కూడా ఉన్నారు. తూర్పు టికెట్‌కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన ఇయన చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాంగ్రెస్ లోని చాలా మంది నేతలతో పాటు రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఇయన…. పలు సంఘాల్లో యాక్టివ్ గా పని చేస్తున్నారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న ప్రదీప్ సామల…. ఉద్యమంలో భాగంగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ లో కూడా యాక్టివ్ గా పని చేసిన అనుభవం ఉంది. రాహుల్ జోడో యాత్రతో పాటు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ తూర్పు టికెట్ వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో అత్యధికగా పద్మశాలి సామాజికవర్గం వాళ్లు ఉండటం కూడా ప్రదీప్ కు కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. తాను పక్కా లోకల్‌నంటూ చెబుతున్న ప్రదీప్…. టికెట్ కోసం అన్నివైపుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.

మొన్నటి వరకు ఒక్కరిద్దరు నేతలతో పోటీ ఉందనుకుంటే… తాజాగా ఎన్ఆర్ఐ ప్రదీప్ రాకతో కొండా వర్గం టెన్షన్ పడుతందట! తన సీటుకి పోటీకొస్తుండటంతో అసహనంతో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే టికెట్ తమకే వస్తుందనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు కొండా దంపతులు. సురేఖ కూడా పద్మశాలి సామాజికవర్గానికి చెందటంతో పాటు మురళి మున్నూరు కాపుకు చెందినవారు. తూర్పులో ఈ రెండు సామాజికవర్గాలు ఉండటం వీరికి కలిసివచ్చే అంశం. ఇక 2014లో ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అన్ని అంశాలను క్రోడీకరించుకొని… టికెట్ పై ధీమాగానే ఉన్నారు కొండా దంపతులు. ఒకవేళ ఊహించని పరిణామాలు ఎదురైతే… పరిస్థితేంటన్న చర్చ కూడా ఓవైపు నుంచి తెరపైకి వస్తోంది.

తదుపరి వ్యాసం