LB Nagar Madhu Yashki Issue: మధుయాష్కీకి వ్యతిరేకంగా ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు
LB Nagar Madhu Yashki Issue: తెలంగాణ కాంగ్రెస్‌లో టిక్కెట్ల లొల్లి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎల్‌బి నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా స్థానిక నేతలు ఢిల్లీ బాట పట్టారు.
LB Nagar Madhu Yashki Issue: ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ దరఖాస్తు చేసుకోవడంపై రగడ కొనసాగుతోంది. మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మెన్ మదుయాష్కీకి టికెట్ ఇవ్వోద్దంటూ డిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలను ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు మల్ రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి,జితేందర్, దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి కలిశారు.
గతంలో కూడా ప్యారాచుట్ నేతలకు టికెట్ ఇవ్వొద్దంటూ మధుయాష్కికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రెండు వారాల క్రితం కూడా గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గోటు నిజామాబాద్, ఎల్బీ నగర్ రావొద్దంటూ పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లపై యాష్కీ తీవ్రంగా స్పందించారు. తనపై వెలిసిన పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అతను కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి అని మండిపడ్డారు. ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశ పడేవారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. పార్టీలోని కోవర్టుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అన్ని నియోజక వర్గాల్లో ఆశావహుల్ని వడపోసి తుది జాబితాను ఏఐసిసికి పంపిన తర్వాత నెలాఖరులోగా అభ్యర్థుల్ని ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండే ఎల్బీ నగర్‌ను ఈ సారి పోటీ చేయాలని మధుయాష్కీ భావిస్తున్నారు.