Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ
16 May 2024, 18:23 IST
- Bhadradri District News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమానవీయ ఘటన వెలుగు చూసింది. దేవుడి పండగ కోసం చందా ఇవ్వలేదన్న కారణంతో పలు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు. పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు.
భద్రాద్రి జిల్లాలో కుటుంబాల గ్రామ బహిష్కరణ ( representative image)
Bhadradri Kothagudem District News: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి తన మేధాశక్తితో ఖగోళంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అయినా ఇంకా ఎక్కడో ఒక మూలన మూఢ విశ్వాసాలు మాత్రం మనిషి కాళ్లకు బంధాలుగా అడ్డుపడుతూనే ఉన్నాయి. కట్టుబాట్ల కట్టలు ఇంకా మనిషి జన జీవనానికి ఆటంకంగా మారుతూనే ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డెరంగాపురంలో ఆలస్యంగా వెలుగు చూసిన అమానవీయ ఘటన ఈ కోవకే చెందింది. గ్రామంలో బొడ్రాయి వేయడానికి చందా ఇవ్వలేదన్న కారణంతో 19 అన్యమత కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించడం విస్మయం కలిగిస్తోంది.
అసలేం జరిగిందంటే.. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ఆ గ్రామం నడి బొడ్డున బొడ్రాయిని ప్రతిష్టించాలని గ్రామ పెద్దలు సంకల్పించారు. అయితే ఇందుకు కావాల్సిన వ్యయాన్ని గ్రామస్తుల నుంచే చందాల రూపంలో వసూలు చేయాలని భావించారు. గ్రామంలో మొత్తం 120 గడపలు ఉండగా ప్రతి ఇంటి నుంచి రూ.3 వేలను చందాగా వసూలు చేయాలని తీర్మానం చేసి వసూలు ప్రక్రియ చేపట్టారు.
గ్రామంలోని 19 కుటుంబాల ప్రజలు మాత్రం మేం చందా ఇవ్వలేమని తెగేసి చెప్పారు. వారు వేరే మతానికి చెందినవారు కావడమే ఇందుకు కారణం. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు సదరు 19 కుటుంబాల ప్రజలపై గ్రామ బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.
వారికి సహకరిస్తే రూ.5 వేలు జరిమానా..
గ్రామ బహిష్కరణకి గురైన ఆ 19 కుటుంబాల ప్రజలకు గ్రామంలో మరెవరూ ఏ రకంగానూ సహకరించకూడదన్నది తీర్మానం. కిరాణా దుకాణంలో బియ్యం, సరుకులు వంటి నిత్యావసర వస్తువులు కూడా వీరికి విక్రయించకూడదు. పెద్దల ప్రకటన ప్రకారం చివరికి పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా సహకరిస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
దీంతో ఆ 19 కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ జీవనం సాగించారు. పప్పు, ఉప్పు కొనుగోలు చేయడానికి కొట్టుకి వెళ్లినా పెద్దల ఆంక్షలకు భయపడి దుకాణదారులు వీరికి వస్తువులు విక్రయించేవారు కాదు. దీంతో కొంతకాలం పాటు నలిగిపోయిన ఆ కుటుంబాల్లో కొందరు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్తులతో చర్చలు జరిపి…విచారణ జరుపుతున్నారు.