తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pulla Reddy Sweets | పుల్లారెడ్డి మనవడిపై వరకట్నం, గృహహింస కేసు.. భార్యను బంధించి ఇంట్లోనే గోడ కట్టేశాడట!

Pulla Reddy Sweets | పుల్లారెడ్డి మనవడిపై వరకట్నం, గృహహింస కేసు.. భార్యను బంధించి ఇంట్లోనే గోడ కట్టేశాడట!

HT Telugu Desk HT Telugu

15 May 2022, 16:16 IST

google News
    • పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం.. వేధిస్తున్నట్టుగా ఆయన భార్య ఫిర్యాదు చేసింది.
ఏక్‌నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డి(ఫైల్ ఫొటో)
ఏక్‌నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డి(ఫైల్ ఫొటో)

ఏక్‌నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డి(ఫైల్ ఫొటో)

పుల్లారెడ్డి స్వీట్స్ ఈ పేరు ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ స్వీట్ల వ్యాపారాన్ని ఈయన వారసులు చూసుకుంటున్నారు. అయితే పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డికి సంబంధించి మాత్రం అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఏక్‌నాథ్ రెడ్డి తన భార్యను తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలొచ్చాయి. తనను ఇంట్లోనే బంధించి గోడ కట్టినట్టుగా ఏక్‌నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2014 మార్చిలో ఏకనాథ్‌తో పెళ్లి సమయంలో రూ.75 లక్షల నగదు, రూ.19.5 లక్షల విలువైన బంగారం, వెండి, రూ.35 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ప్రజ్ఞ కుటుంబం కట్నకానుకలుగా ఇచ్చినట్టుగా తెలిపారు . అయితే అప్పటికే ఏక్ నాథ్ రెడ్డి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడినట్టుగా తర్వాత తెలిసిందని ప్రజ్ఞ ఆరోపిస్తోంది. తన బిడ్డ పేరున ఆస్తి రాయాలని ప్రజ్ఞ డిమాండ్ చేసింది. దీంతో కొంత కాలంగా.. కుటుంబంలో వివాదం నడుస్తోంది. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని తనను హింసిస్తున్నట్టుగా ప్రజ్ఞ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఏక్‌నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా గోడ కట్టినట్టుగా బయటకు వచ్చింది. పోలీసులకు ప్రజ్ఞ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది.

పుట్టింటి వారి సాయంతో.. బయటకొచ్చిన ప్రజ్ఞ నేరుగా వెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గృహ హింస చట్టం కింద ఏక్ నాథ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 10న తన భర్త, అతని తల్లిదండ్రులు తనను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. తన కుమార్తెను, తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారని అంటోంది. తన గదికి కరెంటు, నీళ్లను రాకుండా చేశారని తెలిపింది.

మే 12వ తేదీ ఉదయం మొదటి అంతస్తులో బయటకు రాకుండా గోడ నిర్మించినట్లు ప్రజ్ఞ అంటోంది. తన భర్త, అత్తమామలు తెల్లవారుజామున గోడను నిర్మించారని చెబుతోంది. ఇంటికి బయట నుండి తాళం వేసి బయటకు వెళ్లారని వెల్లడించింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేసినట్లు ప్రజ్ఞ పేర్కొంది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఆమె భర్త మరియు అత్తమామలపై IPC సెక్షన్ 498A, 341తోపాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఏక్ నాథ్ రెడ్డి ఎక్కడున్నదీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం