తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad | జమ్మికుంట టూ నల్లకుంట.. హైదరాబాద్ లో నిత్యజనగణమన

Hyderabad | జమ్మికుంట టూ నల్లకుంట.. హైదరాబాద్ లో నిత్యజనగణమన

HT Telugu Desk HT Telugu

11 May 2022, 20:07 IST

google News
    • సమాజంలోని ప్రతి ఒక్కరిలో దేశ భక్తి, జాతీయత భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టుల బృందం ముందడుగు వేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరుగుతున్న నిత్యజనగణమనను హైదరాబాద్ నల్లకుంటలో ప్రారంభించింది.
జమ్మికుంటలో త్రివర్ణ పతకాన్ని స్వీకరిస్తున్న జర్నలిస్టు బృందం
జమ్మికుంటలో త్రివర్ణ పతకాన్ని స్వీకరిస్తున్న జర్నలిస్టు బృందం

జమ్మికుంటలో త్రివర్ణ పతకాన్ని స్వీకరిస్తున్న జర్నలిస్టు బృందం

సీనియర్ జర్నలిస్ట్ నేలంటి మధు నేతృత్వంలోని యువ జర్నలిస్టుల బృందం జమ్మికుంటలో కొనసాగుతున్న నిత్య జనగణమనను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ లోనూ దాన్ని నిర్వహించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అందులో భాగంగా మల్లాడి క్రాంతి సారథ్యంలో జమ్మికుంట నుంచి ప్రారంభమైన జనగణమన యాత్ర నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ముగిసింది. ఈ యాత్రలో నేలంటి మధు, జర్నలిస్ట్ సిద్దు, మల్లాడి క్రాంతి, నూతి శ్రీకాంత్, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, కోటగిరి చందు, నల్ల ప్రవీణ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

నిత్య జనగణమన కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించేందుకు వచ్చిన జర్నలిస్టు బృందాన్ని జమ్మికుంట ఎస్ఐ అభినందించారు. త్రివర్ణ పతాకాన్ని తీసుకు వెళ్లేందుకు బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. జాతీయత అనేది పవిత్రమైన భావన. ఆ భావనను వ్యాప్తి చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. హైదరాబాద్ లో కూడా నిత్య జనగణమన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన జర్నలిస్టులకు ప్రశంసించారు. జాతీయ జెండాను ర్యాలీగా తీసుకు వెళ్లేందుకు వచ్చిన హైదరాబాద్ కు చెందిన మల్లాడి క్రాంతి ఆధ్వర్యంలోని లీడర్స్ ఫర్ సేవ బృందాన్ని అభినందించారు.

ర్యాలీ నిర్వహకుడు నేలంటి మధు మాట్లాడుతూ.. తమ సంస్థ లీడర్స్ ఫర్ సేవ తరఫున ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న నిత్య జనగణమన కార్యక్రమంతో జమ్మికుంట చరిత్ర సృష్టించిందన్నారు.  తాము కూడా దీన్ని మొదలు పెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి జమ్మికుంటలో నిర్వాహక అధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రముఖ డాక్టర్ రాజేశ్వరయ్య.. జర్నలిస్టులకు పతకాన్ని అందించారు. నేటి యువతీ యువకుల్లో జాతీయతా భావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించిన లీడర్స్ ఫర్ సేవ సంస్థ నిర్వాహకులు నేలంటి మధు, క్రాంతి తదిరులను ప్రశంసించారు.

జాతీయ పతాకాన్ని హైదరాబాద్ తీసుకు వెళ్తున్న బైక్ ర్యాలీకి సారథ్యం వహించిన మల్లాడి క్రాంతి మాట్లాడుతూ.. జాతీయ భావం ఒక్కటే మనుషులను కలిపి ఉంచే చైతన్యవంతమైన విషయం అన్నారు. ముఖ్యంగా యువతీయువకులు బాలబాలికల్లో జాతీయతా భావాన్ని పెంపొందించాల్సిన కర్తవ్యం ఉందని చెప్పారు. దీన్ని తాము హైదరాబాద్ కేంద్రంగా ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం