TSRTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్ - తప్పిన పెను ప్రమాదం
19 January 2024, 18:03 IST
- TSRTC Bus Accident : మేడారం వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
Bhupalpally - Warangal Highway Road: వరంగల్–భూపాలపట్నం హైవే(ఎన్హెచ్–163)పై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం వెళ్లే మార్గంలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. త్రుటితో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కాగా క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అంే5దిస్తున్నారు.
స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ములుగు జిల్లా పస్రా నుంచి ప్రయాణికులతో హనుమకొండకు వస్తోంది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ సమీపంలోని జెర్రిపోతుల వాగు వద్దకు చేరుకోగా.. వరంగల్ వైపు నుంచి ములుగు వైపు వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ వాహనం బస్సును ఎదురుగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న ఓ వెహికిల్ ను ఓవర్ టేక్ చేసేందుకు ట్యాంకర్ డ్రైవర్ ఎదురుగా వచ్చే బస్సును గమనించక కుడి వైపు తిప్పాడు. అప్పటికే బస్సు అక్కడికి చేరుకోగా.. డీజిల్ ట్యాంకర్ వాహనం కాస్త బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు కండక్టర్, మరో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో బస్సులో ఉన్న కొందరు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది డ్రైవర్, కండక్టర్ సహా గాయపడిన వారందరికీ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అందరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
20 వేల లీటర్ల డీజిల్ ఖతం.. భారీగా ట్రాఫిక్ జామ్
బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న దాదాపు 20 వేల లీటర్ల డీజిల్ రోడ్డు పాలైంది. కాగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. డీజిల్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది రోడ్డుపై ఉన్న డీజిల్ చుట్టూ నీటిని వదిలారు. అగ్నిప్రమాదానికి ఆస్కారం లేకుండా రోడ్డుపై డీజిల్ గాఢతను పోగొట్టారు. కాగా ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు రెండు వైపులా వాహనాలను నిలిపేశారు. ఈ మార్గంలో మేడారం వెళ్లే వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు గంటన్నరపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అధికారులు సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లపై ఏర్పడిన గుంతలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు. మరికొద్దిరోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.