CM Revanth in Medaram : మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు - ఈనెల 27న మరో 2 హామీలు ప్రారంభిస్తామని ప్రకటన
23 February 2024, 17:20 IST
- CM Revanth in Medaram Jatara 2024:మేడారంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth in Medaram Jatara 2024: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మేడారంలో పర్యటించారు రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఈ 75 రోజుల పాలనలో ప్రజాపాలనను అందిచామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజా ఆకాంక్షల మేరకే పని చేస్తామని చెప్పారు. మేడారం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ స్కీమ్ గ్యారెంటీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.
నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అతి త్వరలోనే తీపి కబురు చెబుతామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలను సకాలంలో ఇస్తున్నామన్నారు. పరిపాలనను గాడిలో పెడుతున్నామని.... ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
"సచివాలయంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లోపలికి అనుమతి లేదు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి అనుమతి ఉంది. ఆరు గ్యారెంటీలను హామీలను అమలు చేసి తీరుతాం. మేడారంలో నిరంతరం అభివృద్ధి చేస్తాం. మంత్రుల సాకారంతో పర్యవేక్షిస్తాను. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కారిస్తాం. త్వరలోనే మీడియా అకాడమీ ఛైర్మన్ ను నియమిస్తాం. ఈ ప్రబుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను మీడియా తీసుకోవాలి. రెండు పార్టీలు కలిసి కుట్ర చేసే పనిలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరేలా చీకటి ఒప్పందం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిపుణుల సూచనల మేరకే ముందుకెళ్తాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
మేడారం జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమ్మక్క - సారక్క ఆశీస్సులతో మరిన్ని మంచి పనులు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.