Integrated Residential Schools : అంగన్ వాడీల్లో విద్యాబోధనకు అదనంగా టీచర్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
19 July 2024, 14:23 IST
- Telangana Integrated Residential Schools : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
Integrated Residential Schools : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్కిటెక్ట్స్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా ముఖ్య అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కారదర్శి బుర్రా వెంకటేశంకు సూచించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికలను రూపొందించండి - సీఎం రేవంత్ ఆదేశాలు
“సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలి. అంగన్ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలి. 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలి. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రాణాళికలుండాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ను మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అధునాతన వసతులతో విద్యను అందించడంతోపాటు విద్యార్థుల్లో సమానత్వ భావన పెరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఒకేచోట "ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్" పేరుతో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో చేపచ్చే పైలట్ ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.