తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr: వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల జీవో… సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

CM KCR: వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల జీవో… సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

HT Telugu Desk HT Telugu

17 September 2022, 17:05 IST

google News
    • 10 percent reservation for tribals in telangana: గిరిజన రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (twitter)

తెలంగాణ సీఎం కేసీఆర్

cm kcr on tribals reservation: వారం రోజుల్లోనే గిరిజన రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవోను విడుదల చేస్తామన్నారు సీఎం కేసీఆర్. బంజారా హిల్స్ లో నిర్మించిన ఆదివాసీ, సేవాలాల్ మహరాజ్ పేరుతో నిర్మించిన బంజారా భవన్ లను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... గిరిజన రిజర్వేషన్లు, పోడు భూమలతో పాటు పలు అంశాలను ప్రస్తావించారు.

ఆదివాసీ బంజారా జంట భవనాలవద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు, బంజారా సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ భవన్ కు చేరుకున్న సీఎం అక్కడ సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేశారు. అనంతరం ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు. భవనంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ గోండు వీరునికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ‘యాడీ బాపు రామ్ రామ్ ’ అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బంజారా బిడ్డలందరికీ అభినందనలు తెలిపారు.

బంజార భవన్ ను ప్రారంభించటం అంటే ఇవాళ భారతదేశ గిరిజన జాతి బిడ్డలకు స్ఫూర్తిని కలిగించే సందర్భమన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బంజారా బిడ్డల గౌరవం తెలిసేలా నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. భవనాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉందన్న ఆయన... గిరిజన జాతి నుంచి పైకెదిగిన ఉద్యోగులు నాయకులు మేధావులకు వారి భవిష్యత్తు తరాలను ముందు వరసలో నడిపే బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.‘‘ కేవలం భవనాలను నిర్మించుకోవడమే కాదు. వాటిని సద్వినియోగం చేసుకునే దిశంగా గిరిజన మేధావి వర్గం ఉద్యోగులు ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర నీటిపారుదలశాఖలో పనిచేసే హరిరామ్ లాంటి అనేకమంది బంజారా బిడ్డలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. వారికి నా అభినందనలు." అని తెలిపారు.

‘‘ ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటన్నింటినీ వేర్వేరు చోట్ల వేర్వేరుగా మాట్లాడుకుంటారు. కానీ, గిరిజన భాషను మాత్రం ప్రపంచమంతటా ఒకేవిధంగా మాట్లాడుకుంటారు. ఇదొక గొప్ప విషయం. గిరిజన బిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటే, మహారాష్ట్రలో బీసీలుగా, మరోచోట ఓసీలుగా ఉన్నారు. వీరందరినీ సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి మేం చెప్పడం జరిగింది. 10 శాతం రిజర్వేషన్ల అమలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోవటం లేదు. స్వయంగా నేనే వెళ్లి ప్రధానికి అన్ని విషయాలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు వరకు నిర్ణయం తీసుకోలేదు. మోదీ మా తీర్మానాలను అమలు చేస్తావా లేదా..? లేక వాటినే ఉరితాడులుగా చేసుకుంటారా..? ఇక కేంద్రం నిర్ణయం కోసం వేచి చూసే పరిస్థితి లేదు. వచ్చే వారం రోజుల్లోనే తెలంగాణలోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా జీవోను ఇస్తాం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశిస్తున్నాను. అలాగే, రాష్ట్రంలో పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించుకునేందుకు ఇటీవలే కమిటీలు కూడా వేసుకోవాలని జీవో ఇచ్చినం. మీరందరూ పోడు భూముల సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలి.’’ అని సీఎం కేసీఆర్ గిరిజనులకు పిలుపునిచ్చారు.

గిరిజన బంధు…

దళితబంధు తరహాలోనే త్వరలోనే గిరిజన బంధును తీసుకొవస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. గిరిజనులంతా ఏకతాటిపై ఉండి నడవాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా సభలో పాల్గొన్న, అధికారులు, బంజారా మేధావులందరూ గిరిజన గూడేల్లో నివసిస్తున్న నిరుపేదల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచి ఆలోచనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. చీఫ్ సెక్రటరీ కూడా గిరిజనులంటే అభిమానం ఉన్న వ్యక్తేనని, వారు కూడా సర్వీసులో మొట్టమొదట ఐటీడీఏలో పనిచేశారని గుర్తు చేశారు. గిరిజన సమస్యలన్నీ తెలిసిన సీఎస్ సహకారం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందన్నారు.

తదుపరి వ్యాసం