TS National Integration Day : విచ్ఛిన్న శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్…..-cm kcr participated in ts integration day celebrations in public gardens ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts National Integration Day : విచ్ఛిన్న శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్…..

TS National Integration Day : విచ్ఛిన్న శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్…..

B.S.Chandra HT Telugu
Sep 17, 2022 12:06 PM IST

TS National Integration Day తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా అమర వీరులందరికీ పేరు పేరునా తలచుకోవడం మన బాధ్యత అని వారందరి స్మృతిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని, సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని ఆరోపించారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రసంగిస్తున్న కేసీఆర్
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రసంగిస్తున్న కేసీఆర్

TS National Integration Day తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయ‌ని కేసీఆర్ చెప్పారు. నాటి జ్ఞాపకాలు తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయన్నారు. యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేదేనని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారని, ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారని, మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా నాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం తెలంగాణ సమాజ బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.

<p>పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్</p>
పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్


ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందామన్నారు. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకోవాలని, సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దామన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుంటున్నట్లు చెప్పారు.

యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఇటీవలనే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేదని, కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేదని, కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకున్నట్టే భారతదేశం కూడా ఓ రూపును తెచ్చుకుందన్నారు.

తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ విదితమేనన్నారు. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది.

భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందామని, ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందామన్నారు. జనగామసింహంగా పేరు గాంచిన నల్లా నర్సింహులునూ, జీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతికోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూ, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను సదా స్మరించుకుందాం. పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వర రావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని పుణికిపుచ్చుకుందామని చెప్పారు.

నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందామని, ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగిందని, మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని చెప్పారు.1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురవుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుందని, ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదని, సఖ్యత ఏర్పడలేదని అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందని చెప్పారు.

తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నదని కేసీఆర్ చెప్పారు.విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందన్నారు.

2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు.తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించిందని, 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం గర్వకారణం అన్నారు.

IPL_Entry_Point

టాపిక్