తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Podu Pattas: పోడు పట్టాల పంపిణీ ప్రారంభం - ఆ కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

Podu Pattas: పోడు పట్టాల పంపిణీ ప్రారంభం - ఆ కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

30 June 2023, 19:12 IST

google News
    • CM KCR Asifabad Tour: సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పోడు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. వారందరికీ రైతుబంధు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం కేసీఆర్.
పోడు పట్టాలు పంపిణీ
పోడు పట్టాలు పంపిణీ

పోడు పట్టాలు పంపిణీ

CM KCR Asifabad Tour Updates: గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన... చిల్డ్రన్‌ పార్క్‌లో కొట్నాక్‌ భీంరావ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... పోడు భూముల కోసం పోరాడిన వారిపై కేసులు నమోదయ్యాయని... అలాంటి కేసులన్నీ ఎత్తివేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోరారు. పోడు పట్టాలు ఇచ్చిన భూములకు కూడా రైతుబంధు అందజేస్తామని ప్రకటించారు. గిరిజనులే కాకుండా… కొందురు ఇతరులు కూడా పోడు భూములను సాగు చేశారని… వారికి కూడా లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించిన సర్కార్….. 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాల భూమిపై 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించింది. పోడు భూములకు రైతుబంధు వర్తింపజేయటంతో… రాష్ట్రంలోని రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరో 1,51,146 పెరగనుంగి. 4,06,369 ఎకరాలకు రైతుబంధు కింద ప్రభుత్వంపై ఏటా రూ.406.36 కోట్ల భారం పడనున్నట్లు సర్కార్ అంచనా వేసింది.

మరోవైపు అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టింది తెలంగాణ సర్కార్. 3 శాఖల అధికారులు, లబ్ధిదారుడి సంతకాలను పొందుపరిచారు. హక్కు పత్రాలపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకాలుండేలా జాగ్రత్తలు తీసుకుంది. లబ్ధిదారుని ఫొటోను సైతం ఇందులో పొందుపరిచారు.

జిల్లా పార్టీ ఆఫీస్ ప్రారంభం…

ఆసిఫిబాద్ జిల్లా టూర్ లో భాగంగా…. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీార్. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్పకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత… పోలీస్‌ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.

ఈ పర్యటనలో భాగంగా… ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఆ జిల్లాల్లోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్‌ ప్రగతి నివేదన సభా వేదికలో మాట్లాడిన ఆయన…. ఆసిఫాబాద్‌ కూడా త్వరలోనే మున్సిపాలిటీగా రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. వార్దా నది మీద బ్యారేజ్‌ మంజూరు అయ్యిందని… ఆ బ్యారేజ్‌ నీటిలోంచి ఆసిఫాబాద్‌లో 76 వేల నుంచి 86 వేల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత తనదని హామీనిచ్చారు.మిగతా పార్టీలు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నారని… అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. ధరణి ఉండాలా వద్దా అంటూ సభా వేదిక నుంచి ప్రజామోదం కోరారు.

శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం తమదని… గతంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చేశామని గుర్తు చేశారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న…. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజారిటీ మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం