FIR On Ex MLA Gandra : భూకబ్జా వ్యవహారం..! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు
18 January 2024, 22:12 IST
- FIR On Ex MLA Gandra Venkata Ramana Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు నమోదైంది. భూకబ్జా విషయంలో కేసు నమోదు కాగా… ఇందులో గండ్ర సతీమణి జ్యోతితో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయి. ఈ కేసు విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర
EX MLA Gandra Venkata Ramana Reddy: భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి తో పాటు ఆయన భార్య వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ జ్యోతి, మరికొందరిపై కేసు నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలాచోట్ల బీఆర్ఎస్ నాయకుల కబ్జా బాగోతాలు బయటపడుతుండగా.. ఇప్పుడు భూ ఆక్రమణ విషయంలోనే మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇదివరకు కేవలం ఆరోపణలు వినిపించగా ఈసారి కేసు నమోదు కావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి గ్రామం శివారు గోరంట్లకుంట చెరువు శిఖానికి సంబంధించిన 209 సర్వే నెంబర్ లోని భూమిలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే బిల్డింగ్ పనులు చేపట్టగా.. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో బిల్డింగ్ కన్ స్ట్రక్చన్ స్టార్ట్ చేశారు. దాదాపు రెండు ఫ్లోర్ల వరకు స్లాబులు వేసి, మూడో ఫ్లోర్ పనులు కూడా మొదలు పెట్టారు. దీంతో స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది చెరువు శిఖం భూమి కావడంతో పాటు ఆ సర్వే నెంబర్ లోని ల్యాండ్ పై కోర్టులో కేసు కూడా నడుస్తుండగానే గండ్ర కబ్జాకు తెరలేపాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విషయం కాస్త మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి వెళ్లడం, అప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారిపోవడంతో గత నెలలో అధికారులు గండ్రకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొనగా.. ఆ తరువాత నిర్మాణ పనులు ఆగిపోయాయి.
కోర్టు ఆదేశాలతో కేసు
గండ్ర వెంకటరమణారెడ్డికు మున్సిపల్ అధికారులు ఇవ్వగా.. నాగవెళ్లి రాజలింగం అనే వ్యక్తి పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల తరఫున ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఆయన ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ కమ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ విషయంపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. 'ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్' కింద కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఆయన భార్య, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సెగ్గెం వెంకటరాణి, సెగ్గెం సమ్మయ్య అలియాస్ సిద్ధు, కొత్త హరిబాబు, గండ్ర హరీశ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి అనే ఏడుగురిపై ఐపీసీ 386, 406, 409, 420, 447, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది.