Revanth Reddy Challenge to KTR: నీ ఎమ్మెల్యే గండ్ర అవినీతిపై చర్చకు మేం రెడీ.. నువ్వు సిద్ధమా KTR? -tpcc chief revanth reddy challenge to minister ktr over padayatra in bhupalpally ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Challenge To Ktr: నీ ఎమ్మెల్యే గండ్ర అవినీతిపై చర్చకు మేం రెడీ.. నువ్వు సిద్ధమా Ktr?

Revanth Reddy Challenge to KTR: నీ ఎమ్మెల్యే గండ్ర అవినీతిపై చర్చకు మేం రెడీ.. నువ్వు సిద్ధమా KTR?

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 10:17 PM IST

Revanth Reddy Padaytra:రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన... స్థానిక ఎమ్మెల్యే గండ్రపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

పాదయాత్రలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On Minister KTR: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అవినీతినిపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన... ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

“రాజీవ్ విగ్రహం సాక్షిగా డ్రామారావుకు సవాల్ విసురుతున్నా.. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ.. బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధమా” అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తిరుమలాపూర్ గ్రామం నుంచి మొగుళ్లపల్లి బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించిన ఆయన.. అనంతరం అక్కడే నిర్వహించిన జనసభలో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని... ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక అన్నారు. "రాణిరుద్రమదేవి, విస్నూరు దొరల మీద తిరుగబాటు చేసిన చాకలి ఐలమ్మ వంటి వారు నడిచిన నేల ఇది. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. పాదయాత్రలో ఎవరిని కదిలించిన కష్టాలే కనిపిస్తున్నాయి. యువకులు ఉద్యోగాలు రాలేదని, రుణమాఫీ కాలేదని రైతులు వాపోయారు. ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కానీ కేసీఆర్, ఆయన బంధువులకు విలాసవంతమైన జీవితం వచ్చింది. వాళ్ల ఆస్తులు పెంచుకున్నారు.. తప్ప.. తెలంగాణకు చేసిందేం లేదు. ఉద్యమ సమయంలో రబ్బర్ చెప్పులతో తిరిగిన కేసీఆర్ కు హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూములు, రాసుకోవడానికి పేపర్లు, చూసుకోవడానికి టీవీలు వచ్చాయి. ధరణి తెచ్చిర్రు దందాలు మొదలు పెట్టారు" అని ఆరోపించారు.

నక్సలెట్ల ఏజెండా తన ఏజెండా అని కేసీఆర్ అన్నారని... కొడుకుకి, కూతురికి, అల్లుడికి, సడ్డకుని కొడుకుకి, ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లికి, బంధువు వినోద్ కుమార్ కు పదవులు ఇవ్వాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. "ధరణి తేవాలని, హరితహారం కింద గిరిజనుల భూములు గుంజుకోవాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది. పోడు భూములపై ప్రశ్నించిన గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టాలని ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది. కాంగ్రెస్ ఏం చేసిందా గండ్రా....నిన్ను ఎమ్మెల్యేను చేసింది, చీఫ్ విప్ చేసింది, నీ ఆస్తి అంతా కాంగ్రెస్ పార్టీలోనే సంపాదించుకుంది. నీవు గెలిచి వందల కోట్లకు అమ్ముడు పోయ్యావు. ఆ గెలుపులో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం లేదా. ఈ ఒక్కడే కాదు డర్టీ డజన్ మంది ఎమ్మెల్యు ఉన్నారు. పార్టీ పిరాయించిన ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారు" అంటూ గండ్రను కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.హైదరాబాద్ లో నడి రోడ్డుపై చిన్నారి కుక్కలు కరిచి చనిపోతే మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? కనీస మానవత్వం లేని మీరు మనుషులా రాక్షసులా? మన జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి అంటూ ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ తక్షణం మృతి చెందిన బాలుడు కుటుంబాలకు క్షమాపణ చెప్పి, ఆ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Whats_app_banner