BRS MLA Lasya Nandita: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. సదాశివపేట నుంచి వస్తుండగా ప్రమాదం
23 February 2024, 9:09 IST
- MLA Lasya Nandita: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో Road Accident ఆమె ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
MLA Lasya Nandita: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ORR జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పిన వాహనం రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం జరిగింది. కారు మధ్య సీటులో ఎమ్మెల్యే సీటు బెల్టు లేకుండా కూర్చున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయారు. తొలుత పఠాన్ చెరు అమెధా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పోస్టు మార్టమ్ కోసం తరలించారు.
సదాశివ పేటలో జరిగిన ఓ పార్టీ నుంచి పిఏ ఆకాష్‌తో కలిసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఆకాష్ ఉన్నారు. గురువారం రాత్రి సదాశివపేటలో జరిగిన పార్టీ నుంచి పటాన్‌చెరు వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఆకాష్ అమెదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లాస్య నందిత ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారనే దానిపై స్పష్టత కొరవడింది. బాసర నుంచి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా సన్నిహితులు మాత్రం సదాశివపేట నుంచి వస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఆకాష్ ఎమ్మెల్యే పిఏ, డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కానిస్టేబుల్ పరీక్షల్లో ఆకాష్ ఎంపికైనట్టు చెబుతున్నారు. నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో కూడా ఆకాష్ వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు.
కేసీఆర్ దిగ్బ్రాంతి….
లాస్య నందిత మృతిపై బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి చెందడంతో పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బిఆర్‌ఎస్ నాయకులు చేరుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డి లాస్య నందిత కుటుంబానికి సంతాపం తెలిపారు.
పటాన్‌చెరు సమీపంలో సుల్తాన్‌పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్‌ను ఎక్స్‌ఎల్ 6 వాహనం ఢీకొట్టింది. సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ సమీపంలో మేడ్చల్ వెళ్లే పాయింట్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి తరలించిన తర్వాత క్షతగాత్రులు ఎమ్మెల్యేగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఏడాదిలోనే తండ్రి కూతుళ్ల మృతి….
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుమార్తెకు గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అంతకు ముందు కార్పొరేటర్‌గా పనిచేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆయనపై అభిమానంతో అభిమానులు సాయన్న కుమార్తెను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. రెండ్రోజుల క్రితం సాయన్న ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఇంతలోనే లాస్య నందిత మృతి చెందడంపై అందరిని విషాదంలో నింపింది.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. కంటోన్మెంట్ స్థానంలో గద్దర్ కుమార్ వెన్నెల కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు.
లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు జరిగాయి. ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండ సమీపంలో ఆమె ప్రయాణించిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. బిఆర్‌ఎస్ బహిరంగ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళుతుండగా డివైడర్ మీదకు ఆమె వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలను క్రమబద్దీకరిస్తున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు.
నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్య నందిత కొత్త కారును కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఆ కారులో ప్రయాణిస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్య నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పయారు. ఆమె మృతదేహాన్ని అమేద ఆస్పత్రికి తరలించారు.
వరుస ప్రమాదాలు…
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. డిసెంబర్ 24న బోయిన్‌పల్లిలో ఆమె ఓ లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. బోయినపల్లిలోని వీఆర్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్య నందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఎక్కిన లిఫ్ట్ ట్రబుల్ ఇచ్చింది. లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తేరుకోలేదు. దీంతో లిఫ్ట్ లోపల ఉన్న ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు పలువురు ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. మూడోసారి ఏకంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
కంటోన్మెంట్ నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన జి సాయన్న కూతురైన, నందిత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందిత శవాన్ని, పోలీసులు పఠాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.