KCR On Budget : బడ్జెట్ లో ఏ ఒక్క పాలసీ లేదు... ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం - కేసీఆర్
25 July 2024, 14:14 IST
- KCR Comments On Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఏ ఒక్క పాలసీ సరిగా లేదన్నారు. ఓ కథలా బడ్జెట్ ప్రసంగం ఉందంటూ విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసీఆర్
KCR Comments On Budget : బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పద్దులో దళితబంధు ప్రస్తావన లేకపోవటం విచారకమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్లు బడ్జెట్ ఉందని విమర్శించారు. మత్స్యకారులకు భరోసా లేదని… రైతుబంధు ఎప్పుడు వేస్తారనే ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు.
భట్టి అన్ని వట్టి మాటలే చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానంలో అసెంబ్లీ వేదికగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఒక్క పాలసీ కూడా స్పష్టంగా లేదన్న కేసీఆర్… రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా ఓ కథలా ఉందంటూ ఆక్షేపించారు.
బడ్జెట్ లో ఏం లేదు - కేసీఆర్
“ ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు అర్థమవుతోంది.. దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు ప్రస్తావన లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నిరాశే.. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని తయారు చేయలేదు. రైతు భరోసా ప్రస్తావనే లేదు. ఇది రైతుల బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు.. ఇది ఎవరి బడ్జెట్ కాదు. బడ్జెట్‌లో గ్యాస్, ట్రాష్ తప్ప ఏం లేదు. బడ్జెట్ ప్రసంగంలా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్….
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీ కార్యదర్శి కేసీఆర్‌కుపుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో గురువారం తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. శాసనసభ్యుడిగా ప్రమాణాన్ని కూడా స్పీకర్ సమక్షంలోనే చేశారు.
2024-25 వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడంపై తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న కేసీఆర్… అనంతరం అసెంబ్లీలో ఉన్న మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడుతామని చెప్పారు.
టాపిక్