Medak District News : ఇష్టంలేని పెళ్లి....! నవవధువు ఆత్మహత్య
13 March 2024, 15:06 IST
- Medak District Crime News: మెదక్ జిల్లాలో నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్య
Medak District Crime News: ఇష్టంలేని పెళ్లి చేశారనే మనస్తాపంతో కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడగట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోడగట్టు గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నారు. కాగా పెద్దకూతురు వైష్ణవి పది వరకు చదువుకొని మానేసింది. దీంతో తల్లితండ్రులు ఆమెకు పెళ్లి చేయాలనీ నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వారి మేనల్లుడికి ఇచ్చి ఈ నెల 4 న వివాహం జరిపించారు. ఇష్టంలేని వివాహం చేశారనే మనస్తాపంతో మంగళవారం తల్లిగారింట్లో బాత్రూం లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
ఆర్ధిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య .....
ఆర్ధిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నార్సింగి మండలం బీమ్రావ్ పల్లి గ్రామంలో ఓ మహిళా రైతు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీమ్రావ్ పల్లి గ్రామానికి చెందిన ఇప్పంకింది కలమ్మ(40),భర్త రాములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఉన్న కొద్దిపాటి భూమిలో పంట వేయగా, బోర్లు నీళ్లు పోయకపోవడంతో వేసిన పంట ఎండిపోయింది. దీంతో వారు కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బుల కుటుంబ పోషణకే సరిపోయేవి. కాగా ఆర్ధిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య చిట్టి డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. మంగళవారం ఉదయం భర్త నిద్ర లేచి చూసేసరికి భార్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం క్రిష్ణపుర్ గ్రామానికి చెందిన కూర్మ స్వామి (31) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం కోసం అప్పులు చేసి వరి పంట వేశాడు. బోర్లు పోయాకపోవడంతో పొలానికి నీరందక వరి పంట ఎండి పోయే పరిస్థితి నెలకొంది. దీంతో అప్పులు తీర్తే మార్గం కనపడక మనస్థాపం చెందిన స్వామి పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు చూసి కుటుంబీకులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.