తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Basara Temple : బాస‌ర‌ ఆల‌య పునఃనిర్మాణానికి శ్రీకారం

Basara Temple : బాస‌ర‌ ఆల‌య పునఃనిర్మాణానికి శ్రీకారం

HT Telugu Desk HT Telugu

24 March 2023, 10:42 IST

google News
  • Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణ పనులకు అంకురార్పణ జ‌రిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రత్యేక పూజ‌లు నిర్వహించి, అమ్మవారి ఆల‌య పున:నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

బాసర ఆలయం
బాసర ఆలయం

బాసర ఆలయం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. పున:నిర్మాణంతో పాటుగా ఇతర అభివృద్ధి ప‌నులకు అంకురార్పణ జరిగింది. సరస్వతి అమ్మవారి గర్భాలయ(Saraswathi Temple) పునఃనిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డితో క‌లిసి మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.

ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్(CM KCR) రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్టగా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో దక్షిణ భారతదేశంలోనే విశిష్ఠత ఉన్న బాసర సరస్వతి ఆలయం కొత్త రూపు సంతరించుకుంటుంది. ఇప్పటికే కర్ణాటక శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం.. మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

బాసర ఆలయం(Basara Temple)లో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లు కొలువుదీరారు. గర్భగుడిలో మహా సరస్వతి విగ్రగానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. పై అంతస్తులో మహంకాళి విగ్రహం ఉంది. సరస్వతి అమ్మవారి దర్శనం తర్వాత.. పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలాగా ఉండాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. భక్తులు ప్రత్యేకంగా చూస్తేనే.. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపాన్ని తొలగించి, కొత్తగా నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు.

ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో 7 అంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదు అందస్తులతో మరో రెండు రాజ గోపురాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాకార మండపంలో మరో 50 మీటర్లు ముందుకు జరుగుతుంది. ప్రస్తుతం 10 అడుగల పొడవు 10 అడుగల వెడెల్పుతో గర్భగుడి 25.5 అడుగుల వెడెల్పు, 16.5 అడుగుల పొడవుతో పునర్నిర్మిస్తారు. ఆలయ ముఖ ద్వారం 18.5 అడుగలకు పెంచనున్నారు.

తదుపరి వ్యాసం