తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dy Cm Pawan Kalyan : తెలంగాణకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం - హైడ్రాపై కీలక వ్యాఖ్యలు

Dy CM Pawan Kalyan : తెలంగాణకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం - హైడ్రాపై కీలక వ్యాఖ్యలు

04 September 2024, 14:59 IST

google News
    • వరద విపత్కర పరిస్థితుల్లో తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేస్తానని తెలిపారు,
డిప్యూటీ సీఎం పవన్
డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్

భారీ వర్షాలు, వరదతో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఏపీకి రూ. కోటి విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణకు కూడా కోటి రూపాయలను ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన చేశారు.

తెలంగాణకు రూ. కోటి విరాళం - పవన్ కల్యాణ్

“పక్క రాష్ట్రం, సోదర రాష్ట్రం తెలంగాణ కూడా వరదలతో దెబ్బతింది. తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాను. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి కోటి రూపాయలు అందజేస్తాను. హైదారాబాద్ లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్. కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పూర్తిగా కట్టేసిన తరవాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఇక్కడ(ఏపీలో) ఎలా పరీవాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనేదానిపై చర్యలు తీసుకుంటాం” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇవాళ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని… అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శాయశక్తుల కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన నేతృత్వంలో తాము చాలా నేర్చుకుంటున్నామని చెప్పుకొచ్చారు. “ ఏపీలో దాదాపు 380 పంచాయతీలు దెబ్బతిన్నాయి. నా శాఖ కాబట్టి, నేను నిన్న ఇచ్చిన కోటి రూపాయలు మాత్రమే కాకుండా 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి….

“గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల హైదారాబాద్ అయినా.. ఇక్కడ బుడమేరు అయినా సరే పరీవాహక ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వడం వలన జరుగుతున్న నష్టం ఇది. హైడ్రా లాంటిది రాకముందే సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో పనిచేస్తే ఇలా జరిగేది కాదు. హైడ్రా లాంటి వ్యవస్థ ఒక్కటే సరిపోదు, లే అవుట్లు చేసేముందు… వాటిని కొనే ముందు, వారికి అనుమతులు ఇచ్చేముందు ప్రతిఒక్కరూ ఆలోచించాలి. అక్రమంగా నిర్మిస్తున్న భవనాల్లో లక్షల రూపాయలతో ఫ్లాట్లు కొనడం తరవాత ప్రభుత్వం వాటిని కూలగొట్టడం కంటే ముందే ఆలోచించాలి” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

సినిమా రంగం వ్యక్తుల దగ్గర హడావుడి ఎక్కువ ఉంటుందని… డబ్బు తక్కువ ఉంటుందని చెప్పారు పవన్ కల్యాణ్. వైఎస్ జగన్ లాంటి వ్యక్తుల దగ్గర ఉన్నట్లుగా వేల కోట్లు ఉండవన్నారు. అలాంటి వ్యక్తులు సహాయానికి ముందుకు రావాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల వారు కూడా ముందుకు రావాలన్నారు.చిత్రపరిశ్రమ నుండి ముందుకు వచ్చి సహాయం చేసిన వారికి పవన్ ధన్యవాదాలు చెప్పారు.

“కొల్లేరు, బుడమేరు అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటే కులాల గర్ధన, ఆర్థిక గొడవలు, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే వాటిపై మొండిగా కాకుండా సామరస్యంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటుంది. ముందుగా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా నాయకులు, జనసైనికులను అప్రమత్తం చేసి, వారిని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూస్తున్నాం. గత ప్రభుత్వం స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారు. జగనన్న కాలనీలు అన్ని కూడా ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. ఇది సరికాదు. ముంపు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా లే అవుట్లు వేసి ఇలాంటి విపత్కర పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది” అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

 

 

తదుపరి వ్యాసం