Telangana Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీ - 'గద్దర్ ప్రజా పార్టీ' పేరిట ప్రకటన
21 June 2023, 16:00 IST
- Gaddar Praja Party in Telangana: తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు పోటీ రెడీ అవుతున్న వేళ… మరో కొత్త పార్టీని ప్రకటించారు ప్రజాయుద్ధనౌక గద్దర్. 'గద్దర్ ప్రజా పార్టీ' పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీలో తెలిపారు.
గద్దర్ (ఫైల్ ఫొటో)
Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలోని నేతలు టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. తేడా అనిపిస్తే చాలు... స్వరాలు మార్చేస్తున్నారు. ఇక మున్ముందు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలే కాకుండా... ప్రాంతీయ పార్టీలు కూడా సత్తా చాటాలని చూస్తున్నాయి. అయితే మరో కొత్త పార్టీ పేరు కూడా తెలంగాణ రాజకీయాల్లో వినింపించబోతుంది. ఈ మేరకు ప్రజాయుద్ధ నౌక గద్దర్… బుధవారం కీలక ప్రకటన చేశారు.
'గద్దర్ ప్రజా పార్టీ' పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గద్దర్. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసినట్లు వెల్లడించారు. గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలి గుర్తు ఉండే అవకాశం ఉందని సమాచారం.
గజ్వేల్ నుంచి పోటీ…?
గత కొంతకాలంగా గద్దర్ ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల టైంలోనూ ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. స్వయంగా సోనియాగాంధీని కుటుంబ సమేతంగా కలవటంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నప్పటికీ... పోటీ చేయలేదు. ఆ తర్వాత కొంత సైలెన్స్ గా ఉన్నప్పటికీ... ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలోనూ పోటీ చేస్తానని ప్రకటన చేశారు. కానీ ఇది కూడా జరగలేదు. ఇక ఈ మధ్య కాలంలో పలు వేదికలపై మాట్లాడుతున్న ఆయన... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటన కూడా చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడమే కాదు… గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులను కలిసిన ఆయన… ఈ ఏడాది తనకు రక్షణ కల్పించాలని కోరారు.
గద్దర్ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల కథనాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ... ఆయన నుంచి క్లారిటీ రాలేదు. త్వరలోనే కవులు, కళాకారులతో కలిసి భారీ సమ్మేళనానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని నేపథ్యంలో గద్దర్... ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా..? లేక కొత్త పార్టీని ప్రకటించి బరిలో నిలుస్తారా..? అన్న దానిపై చర్చ జరుగుతున్న క్రమంలో…. గద్దర్ తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్లు అయింది.