BRS Party : 'నేను ఇక్కడ లోకల్' - 'సాగర్' టికెట్ పై ఆ నేత కన్ను! తెరపైకి అల్లు అర్జున్
19 August 2023, 10:45 IST
- Telangana Assembly Elections 2023: రాబోయే ఎన్నికల్లో సాగర్ నుంచి బరిలో ఉంటానని అంటున్నారు బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అంతేకాదు.. తన తరపున అల్లు అర్జున్ ప్రచారం కూడా చేస్తారని చెబుతున్నారు. ఫలితంగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో సాగర్ టికెట్ ఆసక్తికరంగా మారింది.
సాగర్ నియోజకవర్గ పరిధిలో చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ కటౌట్లు
Nagarjuna Sagar Assembly Constituency : అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆయా పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. త్వరలోనే చాలా సమీకరణాలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చిన్న పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలను షురూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఇక్కడి పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ సీటుకు బీఆర్ఎస్ పార్టీలో తెగ డిమాండ్ పెరిగిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ… ఈసారి మాత్రం తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కొందరు నేతలు. అంతేకాదండోయ్… తాము ఇక్కడ లోకల్ అనేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. తన తరపున అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఇటీవలే స్థానికంగా పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా సాగర్ రాజకీయం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.... బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన ఈయన... 2014 ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో 47,292 ఓట్లు సాధించిన ఆయన... తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో 11,056 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలంపాటు నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేశారు. ఇదిలా ఉండగానే... టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారెక్కారు. దీంతో 2018 ఎన్నికల్లో మంచిరెడ్డికే టికెట్ దక్కింది. ఫలితంగా కంచర్లకు టికెట్ రాకుండా పోయింది. ఆ తర్వాత కొంతకాలంగా సెలైన్స్ ఉన్న ఆయన... తాజాగా మళ్లీ గేర్ మార్చారు. నాగార్జున సాగర్ బరిలో ఉంటానని అంటున్నారు. తాను ఇక్కడ లోకల్ అని... టికెట్ వస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రంగంలోకి అల్లు అర్దున్….?
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిది సాగర్ నియోజకవర్గం పరిధిలోని భట్టుగూడెం. ఈ ఎన్నికల్లో సాగర్ టికెట్ ఆశిస్తున్న కంచర్ల… స్థానికంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన వెయ్యి మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. దీన్ని ఆయన సొంత అల్లుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. దీంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. ఇక వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ వస్తే… బీఆర్ఎస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని అంటున్నారు. ఇక ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ మరోసారి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈసారి టికెట్ వదులుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇదే అదనుగా కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనమడు రంజిత్ యాదవ్ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కొంతకాలంగా బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా సాగర్ బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నారు. ఒక్క టికెట్ కోసం నలుగురు నేతలు పోటీ పడుతుండటంతో… హైకమాండ్ ఏం చేయబోతుందనేది చూడాలి.
మొత్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ నాగార్జున సాగర్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అడ్డా కావటంతో… ఈ సీటు విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం అచితూచీ అడుగులు వేయాలని చూస్తోంది…!