Hyderabad To Riyadh : ఇక హైదరాబాద్ నుంచి రియాద్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ - ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటన, షెడ్యూల్ ఇదే
18 January 2024, 17:02 IST
- Air India Express Hyderabad-Riyadh Flights 2024: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. హైదరాబాద్ నుంచి సౌదీ రాజధాని రియాద్ కు నేరుగా విమాన సేవలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను పేర్కొంది.
రియాద్‌కు నేరుగా విమాన సర్వీసులు
Air India Express Hyderabad-Riyadh Flights 2024: కొత్త మార్గాలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నేరుగా ఫ్లైట్ సేవలను అందుబాటులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విమాన సర్వీస్‌లను ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేశామని ఆ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ ఉపాధ్యక్షులు తారా నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2 నుంచి సేవలు ప్రారంభం
హైదరాబాద్ నుంచి నేరుగా రియాద్ కు సర్వీసులు ఉంటాయని తారా నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా సౌదీలోని మూడు ప్రధాన నగరాలను కూడా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-రియాద్ మార్గంలో విమాన కార్యకలాపాలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. ప్రతి వారంలో వారంలో మూడు రోజులు అనగా సోమ, బుధ, శుక్రవారం రోజుల్లో ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో శంషాబాద్ నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు బయలుదేరి 3 గంటలకు ఈ విమాన సర్వీస్‌లు రియాద్‌కు చేరుకుంటాయి. తిరిగి అదే రోజు రియాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయదేరి రాత్రి 11 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతాయి.
ప్రయాణీకులు విమానయాన సంస్థ యొక్క మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ (airindiaexpress.com) ద్వారా అలాగే ఇతర ప్రధాన బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది.
"ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు ఇండియా-గల్ఫ్ మార్గాలు ఎల్లప్పుడూ ప్రధానమైనవి. ఇప్పుడు హైదరాబాద్‌ను సౌదీ అరేబియాలోని రియాద్, దమ్మామ్‌లతో అనుసంధానించడం పట్ల మేము సంతోషిస్తున్నాము" అని తారా నాయుడు చెప్పారు. "మేము ఇటీవల హైదరాబాద్‌ను గ్వాలియర్ మరియు అమృత్‌సర్‌తో కలుపుతూ విమానాలను ప్రారంభించాం. ఇప్పటికే హైదరాబాద్ నగరం నుండి అనేక ఇతర దేశాలకు సర్వీసులను నడుపుతున్నాం' అని అన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అనేది…. ఎయిర్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ మరియు టాటా గ్రూప్‌లో భాగ., ప్రతిరోజూ 325 విమానాలను నడుపుతోంది. 31 దేశీయ మరియు 14 అంతర్జాతీయ విమానాశ్రయాలను కలుపుతూ.. 63 విమానాల సముదాయంతో సేవలు అందిస్తోంది. 35 బోయింగ్ 737లు మరియు 28 ఎయిర్‌బస్ A320లు ఉన్నాయి.