HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ఏబీసీ సెంటర్స్.. పరకాలలో ఏర్పాటుకు కసరత్తు

Warangal : మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ఏబీసీ సెంటర్స్.. పరకాలలో ఏర్పాటుకు కసరత్తు

HT Telugu Desk HT Telugu

15 October 2024, 17:13 IST

    • Warangal :  వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. స్టెరిలైజేషన్ ప్రక్రియ సరిగా కొనసాగకపోవడంతో.. కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండగా.. జనాలపై వాటి దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
ఏబీసీ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్
ఏబీసీ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్

ఏబీసీ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్

ఉమ్మడి వరంగల్‌లోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ఒక ఏబీసీ సెంటర్ ఉండగా.. తాజాగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాల్సిందిగా వెటర్నరీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

సరిపడా స్థలంతో పాటు సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరకాలలో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేసిన అనంతరం మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆరేళ్ల కిందట హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులో ఒక ఏబీసీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

నగర పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 70 వేల వరకు వీధి కుక్కల ఉండగా.. నిత్యం దాదాపు 10 నుంచి 15 వరకు కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి. దీంతోనే కుక్కల పెరుగుదలను నియంత్రించడంతో పాటు వాటికి స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. దాని నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.

సంబంధిత ఏజెన్సీ ఒక్కో కుక్కను వ్యాన్ లో తీసుకొచ్చి, మూడు రోజుల పాటు ఏబీసీ సెంటర్‌లో ఆహారం అందించి, స్టెరిలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, మళ్లీ వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినందుకు బల్దియా ఒక్కో కుక్కకు రూ.800 చొప్పున చెల్లిస్తుంది. ఇంతవరకు బాగానే ఉండగా.. వరంగల్ నగరంలో కుక్కల సంఖ్యకు తగ్గట్టుగా స్టెరిలైజేషన్ జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో వాటి బెడద తీరడం లేదు.

చింతగట్టు సమీపంలోని ఏబీసీ సెంటర్ వద్దనే ఇంకో సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ తయారు చేశారు. ఈ మేరకు ఇదివరకే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా మెజారిటీ కార్పొరేటర్ల మద్దతుతో.. మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఇప్పటికే ఆ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌లో ఉండాల్సిన వెటర్నరీ డాక్టర్ తోపాటు.. మరో ఎనిమిది సిబ్బంది నియామకం కోసం కూడా ప్రతిపాదనలు పంపించారు.

తొందర్లోనే ఆ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ సెంటర్ కూడా వినియోగంలోకి వస్తే.. గ్రేటర్ వరంగల్ సిటీలో కుక్కల బెడదకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మిగతా మున్సిపాలిటీల్లోనూ..

ఇప్పటికే పరకాల మున్సిపాలిటీలో ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించగా.. దాని ఏర్పాటు తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో కూడా యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 మున్సిపాలిటీలు ఉండగా.. ఎక్కడికక్కడ ఏబీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తే.. కుక్కల బెడదకు పరిష్కారం లభించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్