TG Govt Schemes : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరొ పథకం.. ఆ సమస్యలకు పరిష్కారం!
TG Govt Schemes : తెలంగాణ రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలతో రైతులు బాధలు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. వారికి మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. త్వరలోనే భూమాత పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
ధరణి తప్పులను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో భూమాత పథకం తెస్తామని ప్రకటించారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కొత్త ఆర్‌వోఆర్ చట్టం రూపుదిద్దుకుంటోందని వివరించారు. సామాన్యుల జీవితాలతో ధరణి చెలగాటమాడిందన్న మంత్రి.. అందరి అభిప్రాయాలతో ధరణిని సవరిస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని భూమాత పథకంగా మార్చి.. అందులోని లోపాలను సరిచేయడానికి ఐదుగురితో కమిటీ వేసింది. గత ప్రభుత్వం రెవెన్యూ చట్టం.. పాసుపుస్తకాల చట్టం - 1971 లోని సెక్షన్ 26ను మార్పు చేస్తూ.. 2020 సెప్టెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా రూపొందించారు. దానికి ధరణి అని పేరు పెట్టారు. 17 సెక్షన్లతో ఈ చట్టాన్ని రూపొందించారు.
ఈ చట్టం మార్పిడితో రైతుల సమస్యలు అన్ని పరిష్కారం అయ్యాయని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. లోపాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ధరణిలో 20 లోపాలు ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. మీ సేవ ద్వారా లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కలోపం సరికాలేదు.
రెవెన్యూ రికార్డుల్లోని సాగుదారుల కాలం (ఖాస్తు కాలం)ను తొలగించారు. దీని వల్ల వాస్తవ సాగుదారులకు నష్టం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో సాదాబైనామాలపై కొనుగోలు చేసినవారు, కౌలుకు చేసేవారు, భూములు తాకట్టు పెట్టుకున్నవారు తమ హక్కులు కోల్పోయారు. రెవెన్యూ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం (1) పట్టాదారుకు (2) వాస్తవ సాగుదారుకు (3) కౌలుదారుకు (4) స్వాధీనపు దారుకు పాసుపుస్తకాలు ఇవ్వాలి.
పట్టాదారుకు ఇచ్చే పాసుపుస్తకంతో పాటు, వాస్తవ సాగుదారుకు మరో పాసుపుస్తకం ఇవ్వాలని చట్టం చెప్పింది. దాన్ని గత ప్రభుత్వం తొలగించడం వల్ల లక్షల మంది తమ స్వాధీనపు హక్కును కోల్పోయారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రెవెన్యూ రికార్డుల్లో తిరిగి సాగుదారుల కాలం (కౌలుదారుల కాలం)ను పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇలా ధరణిలో మార్పులు చేసి.. దాన్ని భూమాత పథకంగా ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పేదలకు భూములు..
డిసెంబర్ 9న పేదలకు భూముల పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇటు.. ఇందిరమ్మ ఇళ్లపైనా మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు వరకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.