Hyderabad IPhones : చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్‌లు.. తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడితే.. అంతే సంగతులు!
25 October 2024, 20:20 IST
- Hyderabad IPhones : ఐఫోన్ వాడాలనేది చాలామంది కల. ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది.. ఎప్పుడు ఆఫర్లు ప్రకటిస్తారు అని ఎంతో మంది ఎదురుచూస్తారు. అలాంటి వారిని మోసం చేయడానికి నకిలీ గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయి. చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నాయి.
చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్‌లు
తొందరగా డబ్బు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్ నకిలీ ఐఫోన్ల విక్రయానికి తెరతీసింది. ఆ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో నకిలీ ఐఫోన్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.3 కోట్లు విలువైన నకిలీ ఐఫోన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పటేల్, ఆశాపూర్, నంది, టార్గెట్ మొబైల్ షాపుల్లో.. చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్ అంటించి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా రోజులుగా ఈ గ్యాంగ్ యాపిల్ పేరుతో దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీపావళి పండగ సీజన్లో పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు భారీ డిస్కౌంట్ని ఇస్తున్నాయి. యాపిల్ లవర్స్‌కి ఫ్లిప్‌కార్ట్ క్రేజీ న్యూస్ ఇచ్చింది. ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ని ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉన్న బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా.. ఐఫోన్ 15 ధరను భారీగా తగ్గించింది.
ఐఫోన్ 15 డిస్కౌంట్..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,900. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.57, 999కే లభిస్తుంది. కొనుగోలుదారులకు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై 17 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్లతో పాటు కొనుగోలుదారులు ఐఫోన్ 15 ధరను మరింత తగ్గించకునేందుకు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు.
ఐఫోన్ 15 ఎందుకు కొనాలి?
కొత్త చిప్సెట్, మెరుగైన కెమెరా, బ్యాటరీ లైఫ్ వంటి అనేక అప్‌గ్రేడ్స్‌తో ఐఫోన్ 15 వస్తుంది. ఐఫోన్ 15లో డైనమిక్ ఐలాండ్ ఉంది. ఇది ఇంతకు ముందు ప్రో మోడల్ ఫీచర్‌గా ఉండేది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన పర్ఫార్మెన్స్, స్మూత్ ఆపరేషన్ కోసం ఏ 16 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 15లో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది ఐఫోన్ 14 12 మెగాపిక్సెల్ కెమెరా కంటే పెద్ద మెరుగుదల.