Bathukamma Sarees: ఐదేళ్లలో 4.79 కోట్ల బతుకమ్మ చీరలు..
13 September 2022, 14:19 IST
- Bathukamma Sarees: గడిచిన ఐదేళ్లలో 4.79 కోట్ల బతుకమ్మ చీరలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది.
బతుకమ్మ పండుగ
హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి రూ. 1,466 కోట్లకు పైగా ఖర్చుతో 18 ఏళ్లు పైబడిన మహిళలకు 4.79 కోట్ల బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. ఆహారభద్రత కార్డుకు అర్హులైన వారందరినీ ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చింది.
ఉచిత చీరల పథకం ఫలితంగా పవర్ లూమ్ ఆపరేటర్లు ఏడాది పొడవునా ఉపాధి పొందే అవకాశం లభించిందని, నేత కార్మికుల జీతాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో నేత కార్మికులకు గౌరవప్రదమైన ఆదాయాన్ని అందించడంతోపాటు, మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలను అందించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.. తెలంగాణకు అతిముఖ్యమైన పండుగ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతుల కోసం అమలు చేస్తున్న 'రైతు భీమా' తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి 10 రోజుల్లో రూ. 5 లక్షలు అందజేస్తారు.
చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, చేనేత సంఘాలు, తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 'చేనేత మిత్ర' పథకం కింద కొనుగోలు చేసే నూలు, రంగులు, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని అందజేస్తోంది. సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటి వరకు 20,501 మంది లబ్ధిదారులకు రూ. 24.09 కోట్ల రాయితీలు అందించారు.