New Police Stations in Hyd: జంటనగరాల్లో కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే?
07 May 2023, 6:31 IST
- New Police Stations in Hyderabad: జంట నగరాల పరిధిలో కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లు..
40 New Police Stations in Hyderabad: హైదరాబాద్ మహానగరంలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురానగర్, మాసబ్ ట్యాంక్, బోరబండ, మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్‌వ్యాలీ పోలీస్‌స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లను ప్రకటించింది. కొత్తగా మేడ్చల్, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ జోన్లుగా నిర్ణయించింది. వీటితో పాటు కొత్తగా ఆరు డీసీపీ జోన్‌లు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో 12 డివిజన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లను, ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏరియాలోనే సైబర్‌క్రైమ్, నార్కోటింగ్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత... శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ సర్కార్. పోలీసుస్టేషన్లను ఆధునాతనంగా మార్చటంతో పాటు అధికారులకు, సిబ్బందికి కూడా కొత్త వాహనాలను అందించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే... సీసీటీవీ కెమెరాల వ్యవస్థను అత్యంత బలోపేతం చేసింది. నగరాన్ని విస్తరించి ఉన్న మూడు కమిషనరేట్లలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న నేరం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా చర్యలు చేపట్టింది. ఇక రిక్రూట్ మెంట్లు కూడా భారీగానే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ను ప్రారంభించింది. ఇక్కడ్నుంచి రాష్ట్రమొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తే 709 పోలీస్ స్టేషన్లు ఉండగా... కొత్త వాటితో కలిపి ఈ సంఖ్య 749కి చేరనుంది. ఇప్పటివరకు ఏడు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి.