World Cup Qualifiers: ఐర్లాండ్‌కు ఒమన్ షాక్.. బోణీ కొట్టిన శ్రీలంక
19 June 2023, 21:32 IST
- World Cup Qualifiers: ఐర్లాండ్‌కు ఒమన్ షాక్ ఇచ్చింది. మరోవైపు శ్రీలంక బోణీ కొట్టింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా సోమవారం రెండు మ్యాచ్ లు జరిగాయి.
శ్రీలంక స్పిన్నర్ హసరంగ
World Cup Qualifiers: వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో తొలి సంచలనం నమోదైంది. ఐసీసీ ఫుల్ టైమ్ మెంబర్ గా ఉన్న ఐర్లాండ్ టీమ్ కు పసికూన అయిన ఒమన్ షాక్ ఇచ్చింది. మరోవైపు యూఏఈపై శ్రీలంక భారీ విజయంతో టోర్నీలో బోణీ కొట్టింది. మాజీ ఛాంపియన్స్ ఏకంగా 175 పరుగులతో యూఏఈని చిత్తు చేసింది. ఈ ఇద్దరి మధ్య 15 ఏళ్ల తర్వాత జరిగిన తొలి వన్డే ఇదే కావడం విశేషం.
ఈ మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్లకు 355 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత యూఏఈ కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో ఏకంగా నలుగురు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు నిస్సంక, కరుణరత్నెతోపాటు కుశల్ మెండిస్, సమరవిక్రమ హాఫ్ సెంచరీలు చేయడంతో లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 355 రన్స్ చేసింది.
తర్వాత చేజింగ్ లో లంక స్పిన్నర్ల ధాటికి యూఏఈ తట్టుకోలేకపోయింది. హసరంగ 6 వికెట్లు తీయడంతో యూఏఈ 39 ఓవర్లలోనే 180 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో క్వాలిఫయర్స్ లో శ్రీలంక ఘనంగా బోణీ చేసింది.
ఇక సోమవారం (జూన్ 19) జరిగిన మరో మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఒమన్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. అయితే ఇంత భారీ స్కోరును కూడా ఒమన్ చేజ్ చేయడం విశేషం. చేజింగ్ లో కశ్యప్ ప్రజాపతి, అకీబ్ ఇలియాస్, కెప్టెన్ జీషాన్ మక్సూద్ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో మరో 11 బాల్స్ మిగిలి ఉండగానే 5 వికెట్లతో ఒమన్ గెలిచింది. ఐసీసీలో పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్టుపై ఒమన్ గెలవడం ఇదే తొలిసారి.