తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Blue Aadhaar Card అంటే ఏంటి? ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?

Blue Aadhaar Card అంటే ఏంటి? ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?

Hari Prasad S HT Telugu

24 January 2022, 21:25 IST

google News
    • Blue Aadhaar Card గురించి ఎప్పుడైనా విన్నారా? పేరుకు తగినట్లే ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. మరి ఈ ఆధార్‌ కార్డు ఎవరికి అవసరం? దీనిని ఎలా పొందాలి?
ఐదేళ్లలోపు పిల్లల కోసమే ఈ బ్లూ ఆధార్ కార్డ్
ఐదేళ్లలోపు పిల్లల కోసమే ఈ బ్లూ ఆధార్ కార్డ్ (UIDAI Twitter)

ఐదేళ్లలోపు పిల్లల కోసమే ఈ బ్లూ ఆధార్ కార్డ్

ఆధార్‌ కార్డు గురించి అందరికీ తెలుసు. మరి Blue Aadhaar Card గురించి ఎప్పుడైనా విన్నారా? పేరుకు తగినట్లే ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. మరి ఈ ఆధార్‌ కార్డు ఎవరికి అవసరం? దీనిని ఎలా పొందాలి? దీనికోసం ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

అసలేంటీ బ్లూ ఆధార్‌ కార్డ్‌?

దేశంలోని ప్రతి పౌరుడికి ఓ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దశాబ్దానికి పైనే అయింది. ఇప్పటికే దాదాపు దేశంలోని మెజార్టీ జనాభా ఈ ఆధార్‌ కార్డు తీసుకుంది. ఈ ఆధార్‌లో ప్రతి పౌరుడి బయోమెట్రిక్‌, డెమోగ్రఫిక్‌ సమాచారం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతిదానికీ ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ ఆధార్‌ కార్డులోనే బ్లూ ఆధార్‌కార్డు ఉంటుందని మీకు తెలుసా? మామూలు ఆధార్‌ కార్డు పెద్దల కోసం కాగా.. ఈ బ్లూ ఆధార్‌ కార్డు పిల్లల కోసం తీసుకొచ్చారు. అందుకే దీనిని బాల ఆధార్‌ కార్డుగా కూడా పిలుస్తారు. అప్పుడే పుట్టిన పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ బ్లూ ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎప్పుడు? ఎవరికి?

ఈ బాల ఆధార్‌ కార్డును ఆధార్‌ జారీ చేసే యూఐడీఏఐ 2018లోనే ప్రవేశపెట్టింది. ఐదేళ్లలోపు పిల్లల కోసం దీనిని తీసుకొచ్చారు. ఒక్క రంగులోనే కాదు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల్లోనూ సాధారణ ఆధార్‌కు, ఈ బాల ఆధార్‌కు తేడాలు ఉన్నాయి. వయోజనుల కోసం తీసుకునే ఆధార్‌కు బయోమెట్రిక్‌ డేటా అంటే వేలి ముద్రలు, ఐరిస్‌ స్కాన్‌ తప్పనిసరి. కానీ ఈ బాల ఆధార్‌కు అవి అవసరం లేదు. ఈ బాల ఆధార్‌ పొందాలంటే పేరెంట్స్ కచ్చితంగా ముందు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌ కార్డు కూడా తప్పనిసరి. దీనికే ఈ బాల ఆధార్‌ను లింకు చేస్తారు. ఆ చిన్నారి వయసు ఐదేళ్లు దాటిన తర్వాత ఈ బాల ఆధార్ ఇక చెల్లదు. ఆ తర్వాత చిన్నారి బయోమెట్రిక్‌ వివరాలను కూడా అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

బ్లూ ఆధార్‌ ఇలా పొందండి

- బ్లూ ఆధార్‌ కోసం మొదట ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించండి. అక్కడ ఎన్‌రోల్‌మెంట్‌ ఫామ్‌ నింపండి.

- చిన్నారి బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌ కార్డు నంబర్‌, మొబైల్‌ నంబర్‌ ఇవ్వాలి.

- చిన్నారి ఫొటో అక్కడే తీస్తారు.

- బాల ఆధార్‌ను తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌తో లింకు చేస్తారు.

- ప్రక్రియ ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు ఒక స్లిప్‌ ఇస్తారు

- రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తుంది. 60 రోజుల్లోపే మీ చిన్నారికి బాల ఆధార్‌ కార్డు జారీ చేస్తారు.

బయోమెట్రిక్‌ వివరాల అప్‌డేట్‌ కోసం..

మీ చిన్నారికి ఐదేళ్లు నిండిన తర్వాత ఈ బ్లూ ఆధార్‌ కార్డు ఇక చెల్లదు. మీరు వాళ్ల బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేయించి సాధారణ ఆధార్‌ కార్డు పొందాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో మీరు అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 

తదుపరి వ్యాసం