Cryptocurrency | ఏంటీ క్రిప్టోకరెన్సీ? వీటిని కొనాలా వద్దా?
24 January 2022, 16:21 IST
- క్రిప్టోకరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. అంటే దీనికి ఒక భౌతిక రూపం అంటూ ఏదీ ఉండదు. ఇది కూడా ఒక రకమైన చెల్లింపు విధానమే. గూడ్స్, సర్వీసెస్ కోసం ఆన్‌లైన్‌లో ఈ క్రిప్టోకరెన్సీని ఎక్స్‌ఛేంజ్ చేయవచ్చు.
ప్రపంచంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్
క్రిప్టోకరెన్సీ.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన డిజిటల్ కరెన్సీ ఇది. దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు ఈ కరెన్సీయే భవిష్యత్తని వాదిస్తుంటే మరికొందరు అదో గాలిబుడగ.. స్థిరత్వం లేనిదంటూ కొట్టిపారేస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు దీనిని అధికారికంగా గుర్తిస్తుంటే.. మరికొన్ని నిషేధం విధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు ఈ క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి? వీటిని కొనొచ్చా? మన దేశంలో ఇది చెల్లుబాటు అవుతుందా? దీనిపై భారత ప్రభుత్వ విధానం ఏంటి? ఒకవేళ కొంటే ఏ క్రిప్టోకరెన్సీ కొనాలి వంటి సమగ్ర సమాచారం ఇప్పుడు చూద్దాం.
క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి?
క్రిప్టోకరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. అంటే దీనికి ఒక భౌతిక రూపం అంటూ ఏదీ ఉండదు. ఇది కూడా ఒక రకమైన చెల్లింపు విధానమే. గూడ్స్, సర్వీసెస్ కోసం ఆన్‌లైన్‌లో ఈ క్రిప్టోకరెన్సీని ఎక్స్‌ఛేంజ్ చేయవచ్చు.
ఇప్పటికే చాలా కంపెనీలు టోకెన్ల రూపంలో తమ సొంత కరెన్సీలను ఇస్తున్నాయి. ఈ క్రిప్టోకరెన్సీని కొనాలంటే మనం వాడే కరెన్సీలోనే చెల్లించాలి. ఈ క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. ఈ బ్లాక్‌చెయిన్ ఒక వికేంద్రీకృత టెక్నాలజీ. ఇది రక్షణ పరంగా అత్యుత్తమమైందన్నది నిపుణుల మాట.
ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలాంటి కేంద్ర బ్యాంకులు కరెన్సీని ముద్రించి, దానికి హామీగా ఉంటాయి. ఈ క్రిప్టోకరెన్సీకి మాత్రం అలాంటి నియంత్రణ, కేంద్రీకృత వ్యవస్థ అంటూ ఏదీ ఉండదు. అంటే ఈ కరెన్సీ పతనమవడంలో, పైకిలేవడంలో ఎవరి నియంత్రణా ఉండదు.
ఎన్ని క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉండటం విశేషం. ఈ ఏడాది నవంబర్ నాటికి ఈ మొత్తం క్రిప్టోకరెన్సీ విలువ 2.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. వీటిలో ప్రముఖమైనదిగా పేరున్న బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం 1.2 లక్షల కోట్ల డాలర్లు కావడం గమనార్హం.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బిట్‌కాయిన్ తర్వాత ఇథెరియం, బినాన్స్ కాయిన్, సొలానా, టెదెర్, కార్డానో, ఎక్స్‌ఆర్‌పీ, పోల్కడాట్, డోజికాయిన్, యూఎస్‌డీ కాయిన్ టాప్ 10లో ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీలు ఎందుకింత పాపులర్?
క్రిప్టోకరెన్సీలకు ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ వచ్చింది. చాలా మంది బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోను భవిష్యత్తు కరెన్సీగా చెబుతున్నారు. వాటి విలువ భారీగా పెరగక ముందే కొనాలన్న ఆతృతలో ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రిప్టోకరెన్సీలపై కేంద్ర బ్యాంకుల నియంత్రణ లేకపోవడం చాలా మందిని ఆకర్షిస్తోంది.
ద్రవ్యోల్బణం పేరుతో కరెన్సీల విలువను కేంద్ర బ్యాంకులు తగ్గిస్తుంటాయి. క్రిప్టోకరెన్సీల విషయంలో ఆ భయం లేదు. మరికొంత మంది ఈ క్రిప్టోకరెన్సీలు ఉపయోగించే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పట్ల ఆకర్షితులవుతున్నారు. మామూలు కరెన్సీ కంటే ఎక్కువ రక్షణ ఈ టెక్నాలజీ అందిస్తుందన్నది వారి నమ్మకం.
టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌లాంటి కుబేరులు ఈ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతుండటంతో వాటికి మరింత ఆదరణ లభిస్తోంది.
క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు మంచివేనా?
బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలు భారీగా పెరుగుతూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు మాత్రం ఇదొక గాలి బుడగ అని అంటున్నారు. ఇవి నిజమైన పెట్టుబడులు కాదని వాదిస్తున్నారు.
నిజమైన కరెన్సీల్లాగే ఈ క్రిప్టోకరెన్సీలు కూడా నగదు చెలామణి చేయలేవని, మీకు లాభం రావాలంటే మరొకరు మీరు చెల్లించినదాని కంటే ఎక్కువ చెల్లిస్తేనే సాధ్యమవుతుందని అంటున్నారు. కరెన్సీ అంటే స్థిరత్వం ఉండాలన్నది కూడా వాళ్ల వాదన.
బిట్‌కాయిన్‌నే తీసుకుంటే అది ఎప్పుడు రికార్డు స్థాయిని అందుకుంటుందో, ఎప్పుడు దారుణంగా పతనమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 65 వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్.. మేలో సగానికి పతనమైంది. మళ్లీ అక్టోబర్ నాటికి 66 వేల డాలర్లను అందుకుంది.
క్రిప్టోకరెన్సీని ఎలా కొనాలి?
బిట్‌కాయిన్‌లాంటి కొన్ని క్రిప్టోకరెన్సీలను అమెరికా డాలర్లలో కొనొచ్చు. మరికొన్నింటిని మాత్రం బిట్‌కాయిన్లు లేదా మరో క్రిప్టోకరెన్సీలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వీటిని కొనాలంటే మీకు వాలెట్ ఉండాలి. ఓ ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ దగ్గర ఉన్న నిజమైన కరెన్సీతో క్రిప్టోకరెన్సీలను కొనాలి. దీనికోసం Coinbase, Coinswitch kuber, Coindcx వంటి ప్రముఖ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఎక్స్‌ఛేంజ్‌లు ఉన్నాయి.
ఇవి వాలెట్‌ను క్రియేట్ చేయడంతోపాటు క్రిప్టోకరెన్సీలను కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడతాయి. eToro, Tradestation, Sofi Active Investing వంటి ఆన్‌లైన్ బ్రోకర్లు కూడా ఈ క్రిప్టోకరెన్సీలను ఆఫర్ చేస్తున్నాయి.
క్రిప్టోకరెన్సీ ఇండియాలో చెల్లుతుందా?
క్రిప్టోకరెన్సీలను అమెరికా వంటి దేశాలు చట్టబద్ధం చేశాయి. అంటే అక్కడ క్రిప్టోకరెన్సీతో వస్తు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో మాత్రం క్రిప్టోకరెన్సీ చట్టబద్ధం కాదు.
అంటే దీనిని ఉపయోగించి అమ్మడం, కొనడం చేయకూడదు. అయితే క్రిప్టోల ట్రేడింగ్‌ను నిషేధించే చట్టాలు మాత్రం ఇండియాలో లేవు. బంగారం ట్రేడింగ్‌కు ప్రత్యేకంగా ప్రభుత్వాలు చట్టాలు చేయనట్లే.. ప్రస్తుతానికి క్రిప్టోకరెన్సీ విషయంలోనూ అలాంటి చట్టమేదీ లేదు.