Virat | మరో 38 పరుగులు చేస్తే కోహ్లీ అరుదైన ఘనత
02 March 2022, 20:30 IST
- విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు ఆడనున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 38 పరుగులు చేస్తే 8 వేల పరుగుల మైలురాయి అందుకుంటాడు. మార్చి 4 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఎన్నో అరుదైన ఘనతలు ఉన్నాయి. మార్చి 4న శ్రీలంకతో జరగబోయే టెస్టు విరాట్ కెరీర్‌లో 100వది కావడంతో ఇప్పుడు అందరి చూపు ఆ మ్యాచ్‌పైనే ఉంది. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే మరో 38 పరుగులు చేస్తే సుదీర్ఘ ఫార్మాట్లో 8వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా విరాట్ అవతరించనున్నాడు.
ఇంతకు ముందు ఈ ఘనతను సచిన్ తెందూల్కర్(15,921), రాహుల్ ద్రవిడ్(13, 288), సునీల్ గావస్కర్(10,122), వీరేంద్ర సెహ్వాగ్(8586), వీవీఎస్ లక్ష్మణ్(8,781) విరాట్ కంటే ముందున్నారు. ప్రస్తుతం 99 టెస్టుల్లో 7,962 పరుగులు చేసిన విరాట్.. మరో 38 పరుగులు చేస్తే ఈ జాబితాలో చోటు దక్కించుకుంటాడు.
మరోపక్క విరాట్ కోహ్లీ అన్నీ ఫార్మాట్లలో కలిపి సెంచరీ సాధించి రెండున్నరేళ్ల పైనే అయింది. ఈ నేపథ్యంలో లంకతో సిరీస్‌లోనైనా శతకం నమోదు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. టెస్టుల్లో 27 సెంచరీలు నమోదు చేసిన రన్నింగ్ మెషిన్.. గత ఐదు టెస్టుల్లో కేవలం 208 పరుగులు మాత్రమే చేశాడు. 2017లో లంకతో సిరీస్ సందర్భంగా మూడు టెస్టుల్లో కలిపి 610 పరుగులు చేసిన అతడు అనంతరం ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. ఆ సిరీస్‌లో రెండు ద్విశతకాలు(213, 243) ఉన్నాయి.
మొహాలీ టెస్టు మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులకు అనుమతి లేకుండానే నిర్వహించేందుకు తొలుత నిర్ణయించినా.. అభిమానుల నుంచి విమర్శలు రావడంతో మార్పులు చేసింది.
టాపిక్