Virat Kohli | కింగ్ వచ్చేశాడు.. ఆర్సీబీ టీమ్‌తో చేరిన విరాట్
22 March 2022, 15:15 IST
- Virat Kohli రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో చేరాడు. కాస్త ఆలస్యంగా, ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా.. సోమవారం ముంబైలోని ఆర్సీబీ క్యాంప్‌కు వచ్చాడు కింగ్ కోహ్లి.
ఆర్సీబీ క్యాంప్ కు వస్తున్న విరాట్ కోహ్లి
ముంబై: తొమ్మిది సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపించిన విరాట్ కోహ్లి ఇప్పుడా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్‌లో ఓ సాధారణ ప్లేయర్‌గా అతడు ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు. గతేడాది అటు టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్సీల నుంచి తప్పుకున్న విరాట్ చాలా స్వేచ్ఛగా కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి తొలగిపోవడంతో ఇక ఇప్పుడు తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడాలని అతడు భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే సోమవారం విరాట్.. ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సిని ఆర్సీబీ తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లి తొలిసారి అతని సారథ్యంలో ఐపీఎల్‌లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. కోహ్లి టీమ్‌తో చేరిన విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కింగ్ కోహ్లి వచ్చేశాడు అంటూ అతని ఫొటోలను షేర్ చేసింది.
ఈ నెల 26న ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడబోతున్నాయి. ఇప్పటి వరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్సీబీ.. ఈసారి కొత్త టీమ్‌తో ఆ కరవు తీర్చుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నెల 27న పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. గతేడాది కెప్టెన్‌గా విరాట్‌కు చివరి సీజన్.
ఇందులో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరినా.. ఫైనల్‌లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ఆర్సీబీ మాత్రం అతన్ని రిటేన్ చేసుకుంది. కోహ్లితోపాటు సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు ఆ టీమ్‌తోనే ఉన్నారు. వేలంలో డుప్లెస్సిని కొనుగోలు చేసిన ఆ టీమ్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.