Dhoni | ధోనీకి విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసేజ్.. ఓ అధ్యాయం ముగిసిందని వెల్లడి
24 March 2022, 20:47 IST
- సీఎస్కే జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. మహీతో అతడికి ఎంతో సాన్నిహిత్యముందని, భావోద్వేగంగా మెసేజ్ చేశాడు. ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు.
ధోనీ-విరాట్ కోహ్లీ
మహేంద్రసింగ్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వైదొలిగడంపై క్రీడా ప్రముఖుల నుంచి సగటు అభిమానుల వరకు ఎంతగానో షాక్ అయ్యారు. చాలా మంది ధోనీ నిర్ణయంపై అశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. ఈ అంశంపై పలువురు క్రికెటర్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఓ శకం ముగిసిందని, మహీ సేవలు మర్చిపోలేమని వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. మహీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఎమోషనల్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"పసుపు దళం నాయకుడు, దిగ్గజ కెప్టెన్ పదవీకాలం ముగిసింది. అభిమానులు ఎప్పటికీ ఈ అధ్యాయాన్ని మర్చిపోలేరు. ఎల్లప్పుడు గౌరవించండి." అని విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్ గురించి భావోద్వేగంతో కూడిన సందేశాన్ని జత చేశాడు. మహీ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలను అందించాడని, అతడితో తన అనుబంధం మర్చిపోలేనని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహీ.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 12 సీజన్లకు కెప్టెన్‌గా వ్యవహరించి 4 సార్లు విజేతగా(2010, 2011, 2018, 2021) నిలిపాడు. ధోనీ నేతృత్వంలో సీఎస్కే ఈ లీగులో అత్యంత స్థిరంగా ఆడుతున్న ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహీ స్థానంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది సీఎస్కే ఫ్రాంచైజీ
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 ఆరంభం కానుంది. అయితే అంతకుముందే మహేంద్ర సింగ్ ధోనీ ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సీజన్ వరకు ఆటగాడిగా సీఎస్కే తరఫునే ఆడనున్నాడు. దీంతో ఈ సీజన్‌కు ధోనీకి బదులు జడ్డూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ కూడా ఈ ఏడాది తన ఆర్సీబీ జట్టుకు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమించింది ఆ జట్టు యాజమాన్యం. గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డుప్లెసిస్‌ను బెంగళూరు జట్టు రూ.7 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
టాపిక్