Venkatesh Prasad on Ishan Kishan: డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ను తీసేయడమేంటి?: మాజీ బౌలర్ సీరియస్
10 January 2023, 10:58 IST
- Venkatesh Prasad on Ishan Kishan: డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ను తీసేయడమేంటి అంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ సీరియస్ అయ్యాడు. శ్రీలంకతో తొలి వన్డే కోసం ఇషాన్ స్థానంలో గిల్‌ను తీసుకుంటున్నట్లు రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇషాన్ కిషన్ స్థానంలో గిల్ కే అవకాశం ఇస్తున్నట్లు చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ
Venkatesh Prasad on Ishan Kishan: టీమిండియా తుది జట్టు ఎంపికపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకతో మంగళవారం (జనవరి 10) తొలి వన్డే జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌నే తీసుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. తనతో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నట్లు స్పష్టం చేశాడు.
అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ కామెంట్స్ వీడియోను జోడిస్తూ వెంకీ ఓ ట్వీట్ చేశాడు. డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ను ఎలా తప్పిస్తారని అతడు ప్రశ్నించాడు. గిల్‌కు అవకాశం ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉందని అతను అభిప్రాయపడ్డాడు.
"ఇండియా ఆడిన చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌కే అవకాశం ఇవ్వడమన్నది న్యాయం. అప్పటికే ఇండియా రెండు మ్యాచ్‌లు ఓడి, సిరీస్ కోల్పోయిన తర్వాత ఇషాన్ ఈ డబుల్ సెంచరీ చేశాడు. గిల్‌కు అవకాశం ఇవ్వడానికి చాలా సమయం ఉంది. కానీ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ను అసలు తీసేయకూడదు" అని వెంకటేశ్ ప్రసాద్ ఆ ట్వీట్‌లో అన్నాడు.
గిల్‌ను తీసుకోవడం ద్వారా తానేమీ ఇషాన్‌కు అన్యాయం చేయడం లేదని, గత 8-9 నెలలు చూస్తే గిల్‌కు ఛాన్స్ ఇవ్వడమే సరైదని అనిపించినట్లు రోహిత్ చెప్పాడు. ఇషాన్ డబుల్ సెంచరీ చేయడం సాధారణ విషయం కాదని, అయితే అంతకుముందు బాగా రాణించిన ప్లేయర్స్‌కు కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వడం న్యాయం కదా అని రోహిత్ అన్నాడు.
ఒకవేళ గిల్‌నే తీసుకోవాలని అనుకుంటే.. అతన్ని మూడో స్థానంలో ఆడించవచ్చు కదా అని ప్రసాద్ ప్రశ్నించాడు. ఇషాన్‌ను ఓపెనింగ్ చేయించి.. రాహుల్ స్థానంలో అతనికే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ప్లేయర్స్‌ను పక్కన పెడుతున్నారు కాబట్టే వైట్‌బాల్ క్రికెట్‌లో ఇండియా సరిగా రాణించడం లేదని, కేఎల్ రాహుల్ సరిగా ఆడకపోయినా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించాడు.