Telugu News  /  Sports  /  Rohit Sharma Reveal Choosing Gill Over Ishan Over Surya Kumar Vs Shreyas In Odi
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Pitamber Newar)

Rohit about Ind vs SL ODI: వన్డే జట్టులో సూర్య, ఇషాన్‌కు చోటు కష్టమే.. క్లారిటీ ఇచ్చిన రోహిత్

10 January 2023, 7:31 ISTMaragani Govardhan
10 January 2023, 7:31 IST

Rohit about Ind vs SL ODI: గువహటీ వేదికగా మంగళవారం నాడు శ్రీలంకతో తొలి వన్డే ఆడనుంది. ఈ సందర్భంగా వన్డే జట్టుకు కెప్టెన్‌గా పునరాగమనం చేసిన హిట్ మ్యాన్.. తుది జట్టులో స్థానాలపై ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

Rohit about Ind vs SL ODI: శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసింది. 2-1 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న భారత్.. ఇక వన్డే సిరీస్‌కు సమాయత్తమైంది. మంగళవారం నాడు తొలి వన్డే ప్రారంభం కానుంది. దీంతో వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. టీ20ల్లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డేలో తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్‌ను కూడా తీసుకోవడం కూడా కష్టమేనని హింట్ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

వన్డేల్లో ఇషాన్ కిషన్ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కే ఛాన్స్ ఇవ్వనున్నట్లు రోహిత్ శర్మ ఖరారు చేశారు. తుది జట్టులో ఇషాన్‌కు స్థానం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు. అయితే గిల్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడని, ఇద్దరిలో మెరుగైన ట్రాక్ రికార్డు అతడికే ఉందని తెలిపాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, అతడికి కూడా ఈ సిరీస్‌లో అవకాశం వస్తుందని రోహిత్ స్పష్టం చేశాడు.

శుబ్‌మన్ గిల్ గతేడాది 12 వన్డేల్లో 70 సగటుతో 638 పరుగులు చేశాడు. ఇందులో ఓ వన్డే సహా 4 అర్ధశతకాలు కూడా ఉన్నాయి. మరోపక్క సూర్యకుమార్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశంపై కూడా రోహిత్ మాట్లాడాడు. టీ20, వన్డే ఫార్మాట్ రెండు వేరు వేరు అని, కాబట్టి సూర్యకుమార్ కంటే కేఎల్ రాహుల్‌కే అవకాశమివ్వనున్నట్లు స్పష్టం చేశాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని తెలిపాడు. అతడి వ్యాఖ్యలను బట్టి సూర్యకుమార్ వన్డే తుది జట్టులో స్థానం కష్టమేనని అనిపిస్తోంది.

"నాకు ఆటగాళ్ల ఫామ్ గురించి బాగా తెలుసు. ఫామ్ చాలా ముఖ్యం. అయితే అంతకంటే ఫార్మాట్ కూడా ముఖ్యం. 50 ఓవర్ల ఫార్మాట్ అనేది విభిన్నంగా ఉంటుంది. టీ20ల కంటే వన్డేలు సుదీర్ఘంగా నడుస్తాయి. కాబట్టి వన్డేల్లో మంచి ప్రదర్శన చేస్తున్నవారికి.. కచ్చితంగా అవకాశం రావాలి. ఈ విషయంలో మేము చాలా క్లియర్‌గా ఉన్నామని" రోహిత్ తెలిపాడు.

2017 డిసెంబరు తర్వాత శ్రీలంకతో భారత్.. ఇంత వరకు వన్డే సిరీస్ ఆడలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత లంక జట్టుతో టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. అయితే ఈ సారి దుష్మంచ చమీర లేకపోవడం ప్రత్యర్థి జట్టుకు పెద్ద సవాలుగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. గువహాటిలో బర్సాపార వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటి వరకు ఈ వేదికపై ఒకే ఒక్క అంతర్జాతీయ వన్డే జరిగింది. 2018 అక్టోబరులో భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 323 పరుగుల లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే భారత్ ఛేదించింది రోహిత్ శర్మ(152), విరాట్ కోహ్లీ(140) భీకర శతకాలకు లక్ష్యం కరిగిపోయింది.