Football Records | ఫుట్‌బాల్‌లో ఈ రికార్డులు తిరగరాయడం ఎవరి వల్లా కాదు!
10 August 2024, 14:22 IST
- Football Records.. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే ఫుట్‌బాల్‌లోనూ ఇలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి. అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యే ఈ రికార్డులకు ఇప్పటి వరకూ ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక గోల్స్ చేసిన లియోనెస్ మెస్సీ
Football Records.. ఫుట్‌బాల్ అనే కాదు.. ఏ స్పోర్ట్ అయినా కొన్ని రికార్డులు ఉంటాయి. అవి పాజిటివ్ రికార్డులు కావచ్చు, నెగటివ్ రికార్డులు కావచ్చు కానీ వాటిని చూస్తే ఇక ఈ రికార్డులు తిరగరాయడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే ఫుట్‌బాల్‌లోనూ ఇలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి. అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యే ఈ రికార్డులకు ఇప్పటి వరకూ ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాలేదు. అలాంటి కొన్ని రికార్డులనే ఇప్పుడు మనం చూడబోతున్నాం.
లాంగెస్ట్ గోల్ రికార్డు
ఇప్పటి వరకూ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక దూరం నుంచి నమోదైన గోల్ స్టోక్ సిటీ ఫుట్‌బాలర్ ఆస్మిర్ బెగోవిచ్ పేరు మీద ఉంది. 2014లో సౌథాంప్టన్‌తో మ్యాచ్‌లో బెగోవిచ్ ఏకంగా 91.9 మీటర్ల దూరం నుంచి గోల్ చేయడం విశేషం.
లాంగెస్ట్ హెడర్ గోల్ రికార్డు
ఇక లాంగెస్ట్ హెడర్ గోల్ రికార్డు నార్వే ఫుట్‌బాలర్ జోన్ శామ్యూల్సన్ పేరిట ఉంది. 2011లో ఓడీడీ గ్రెన్‌లాండ్ టీమ్ తరఫున ఆడుతున్న శామ్యూల్సన్ ఏకంగా 58.13 మీటర్ల దూరం నుంచి హెడర్ గోల్ చేశాడు.
అత్యధిక రెడ్ కార్డుల రికార్డు
ఫుట్‌బాల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒకే మ్యాచ్‌లో ఓ రిఫరీ చూపించిన అత్యధిక రెడ్ కార్డుల సంఖ్య 36. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. అర్జెంటీనాలో క్లేపోల్, విక్టోరియానో అరెనాస్ మధ్య 2011లో జరిగిన మ్యాచ్‌లో ఈ అత్యంత అరుదైన ఘటన జరిగింది. మ్యాచ్ తొలి హాఫ్‌లో ఇద్దరిని, సెకండాఫ్ ఇద్దరు ప్లేయర్స్‌ను రిఫరీ బయటకు పంపించాడు. ఆ తర్వాత ప్లేయర్స్, మేనేజర్లు, కోచ్‌లు, అభిమానుల మధ్య గొడవ జరిగింది. దీంతో రిఫరీ మొత్తం 36 మందికి రెడ్‌కార్డులు చూపించాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పేరిట ఉంది. 2012లో అతడు మొత్తం 91 గోల్స్ చేయడం విశేషం. అందులో 79 బార్సిలోనా క్లబ్ తరఫున, 12 అర్జెంటీనా తరఫున చేశాడు. 1972లో జర్మనీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ పేరిట 85 గోల్స్‌తో ఉన్న రికార్డును మెస్సీ తిరగరాశాడు.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ గోల్ రికార్డు
2002 వరల్డ్‌కప్‌లో మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో టర్కీకి చెందిన హకన్ సుకుర్ ఆట ప్రారంభమైన 10.89 సెకన్లలోనే గోల్ చేశాడు. ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ గోల్ రికార్డు ఇదే.
ఫాస్టెస్ట్ హ్యాట్రిక్
90 సెకన్లలో మూడు గోల్స్ చేయడం ఒక టీమ్‌కే అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. కానీ ఓ ప్లేయరే ఒకటిన్నర నిమిషాల్లో ఇలా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. అతని పేరు టామీ రాస్. 1964లో నైర్న్ కౌంటీతో జరిగిన మ్యాచ్‌లో రాస్ కౌంటీ తరఫున అతడు ఈ రికార్డు సాధించాడు.
ఫాస్టెస్ట్ రెడ్ కార్డ్ రికార్డు
ఓ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఏడు సెకన్లలోనే రిఫరీ రెడ్ కార్డ్ చూపించి పంపించాడు. 2013లో గ్రీస్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో సెర్జ్ జియౌహా అనే ప్లేయర్ ఇలా ఫీల్డ్‌లోకి వచ్చిన ఏడు సెకన్లలోనే రెడ్ కార్డ్‌కు గురై బయటకు వెళ్లిపోయాడు.
గోల్‌కీపర్ చేసిన అత్యధిక గోల్స్ రికార్డు
బ్రెజిల్‌కు చెందిన గోల్ కీపర్ తన 28 ఏళ్ల కెరీర్‌లో 131 గోల్స్ చేయడం విశేషం. 1997 నుంచి 2015 వరకూ అతని కెరీర్ సాగింది. బెస్ట్ గోల్‌కీపర్‌గా ఉంటూనే.. ఈ స్థాయిలో గోల్స్ చేయడం మరెవరి వల్లా కాదేమో.
ఒక్క మ్యాచ్.. 16 సేవ్స్
ఒక మ్యాచ్‌లో ఓ గోల్ కీపర్ ఏకంగా 16 గోల్స్‌ను అడ్డుకున్నాడు. అమెరికాకు చెందిన గోల్‌కీపర్ టిమ్ హోవర్డ్ 2014 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు సాధించాడు. కానీ ఆ మ్యాచ్‌లో చివరికి అమెరికా 1-2 తేడాతో ఓడిపోయింది.