తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Facts | క్రికెట్‌ ఫ్యాన్స్‌ కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు

Cricket Facts | క్రికెట్‌ ఫ్యాన్స్‌ కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు

Hari Prasad S HT Telugu

24 January 2022, 17:27 IST

google News
    • ఇప్పుడు చెప్పబోయే ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌లో మీకు ఎన్ని తెలుసో చూసుకోండి. దానిని బట్టి మీరు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారు? ఆ గేమ్‌ను ఎంతగా ఫాలో అవుతున్నారన్నది మీకే తెలుస్తుంది.
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (AFP)

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది

క్రికెట్‌ గురించి గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మాట్లాడినా బోర్‌ కొట్టని దేశం మనది. ఆ ఆటను అంతలా ప్రేమిస్తాం. మరి శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న ఆ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. 

Cricket Facts సచిన్‌ బ్యాట్‌తో అఫ్రిది సెంచరీ

సుమారు రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌లో చెరిగిపోకుండా ఉన్న వేగవంతమైన సెంచరీని పాక్‌ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ అఫ్రిది.. మన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌తో చేశాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. 1996లో అనుకోకుండా పాక్‌ టీమ్‌కు ఆడే అవకాశం దక్కిన అఫ్రిది ఉన్నపళంగా వెస్టిండీస్‌ నుంచి నైరోబి వెళ్లాడు. 

అయితే ఆ సమయంలో అతని దగ్గర సరైన బ్యాట్‌ కూడా లేకపోవడంతో ఆ టీమ్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ తన దగ్గర ఉన్న సచిన్‌ బ్యాట్‌ను అఫ్రిదికి ఇచ్చాడు. ఆ బ్యాట్‌తో అఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 

అందులో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. శ్రీలంకపై అతడు కొట్టిన ఆ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును చాలా కాలం తర్వాత న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కోరీ ఆండర్సన్‌ (36 బాల్స్‌) బ్రేక్‌ చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు డివిలియర్స్‌ (31 బాల్స్‌) పేరిట ఉంది.

Cricket Facts టెస్ట్‌ మ్యాచ్‌ తొలి బాలే సిక్స్‌

137 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి బాల్‌నే సిక్స్‌గా మలచిన ఏకైక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌. 2012లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు.

Cricket Facts.. తొలి ముద్దు అతడికే..

క్రికెట్‌ ఫీల్డ్‌లో ఓ అమ్మాయి ముద్దు అందుకున్న తొలి ఇండియన్‌ క్రికెటర్‌ అబ్బాస్‌ అలీ బేగ్‌. 1960లో ముంబైలోని బ్రాబోర్న్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. అబ్బాస్‌ హాఫ్‌ సెంచరీ చేయగానే ఓ అందమైన యువతి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి అతని చెంపపై ముద్దు పెట్టింది.

Cricket Facts.. ఐదు రోజులూ ఆడింది ఆ ఇద్దరే..

ఇప్పటి వరకూ టెస్ట్‌ క్రికెట్‌లో మొత్తం ఐదు రోజులూ ఏదో ఒక సందర్భంలో బ్యాటింగ్‌ చేసిన ఘనత కేవలం ఇద్దరు ఇండియన్స్‌కే దక్కింది. వాళ్లలో ఒకరు ఎంఎల్‌ జయసింహ కాగా.. మరొకరు రవిశాస్త్రి.

Cricket Facts.. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌

- ఇండియా, ఇంగ్లండ్‌లకు టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన ఏకైక ప్లేయర్‌ ఇఫ్తికార్‌ అలీఖాన్‌ పటౌడీ. బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ తాత ఈయన.

- ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ను హిట్‌ వికెట్‌గా ఔట్‌ చేసిన ఏకైక బౌలర్‌ లాలా అమర్‌నాథ్. 1948లో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్ట్‌లో బ్రాడ్‌మన్‌ హిట్‌వికెట్‌ అయ్యాడు.

- ఇండియా 1983లో వరల్డ్‌కప్‌ గెలిచిన మూడేళ్ల తర్వాత లార్డ్స్‌లో తొలిసారి ఓ టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. ఆ తర్వాత 2011లో మరోసారి వరల్డ్‌ కప్‌ గెలిచిన మూడేళ్లకు అంటే 2014లో లార్డ్స్‌లో తన రెండో టెస్ట్‌ గెలవడం విశేషం.

- 60 ఓవర్లు, 50 ఓవర్లు, 20 ఓవర్ల క్రికెట్‌ వరల్డ్‌కప్స్‌ గెలిచిన ఏకైక దేశం ఇండియానే. 1983లో ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లు ఉండేవి.

- ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ అలెక్‌ స్టివార్ట్‌ 8-4-63లో జన్మించాడు. అతడు టెస్టుల్లో చేసిన రన్స్‌ సరిగ్గా 8463 కావడం విశేషం.

Cricket Facts.. వందేళ్ల తర్వాత అచ్చంగా..

- చరిత్రలో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 45 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్‌ 1877లో జరిగింది. సరిగ్గా వందేళ్ల తర్వాత 1977లో ఈ టెస్ట్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఇంగ్లండ్‌పై మళ్లీ 45 పరుగులతోనే ఆసీస్‌ విజయం సాధించింది.

- ఒక టెస్ట్‌లో ఒకే రోజు నాలుగు ఇన్నింగ్స్‌ జరిగిన అరుదైన ఘటన ఇప్పటి వరకూ రెండుసార్లు జరిగింది. 2000లో లార్డ్స్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ మధ్య తొలిసారి.. ఆ తర్వాత 2011లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మరోసారి జరగడం విశేషం.

- టెస్ట్‌ క్రికెట్‌ ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు ఒకే బౌలర్‌ తీసుకున్న సందర్భాలు కేవలం రెండే. 1956లో ఇంగ్లండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌, 1999లో పాకిస్థాన్‌పై అనిల్‌కుంబ్లే ఈ ఘనత సాధించారు. అయితే ఈ రెండు అరుదైన ఘటనలను చూసిన ఏకైక వ్యక్తి పేరు రిచర్డ్ స్టోక్స్‌. తన జీవితంలో స్టోక్స్‌ చూసినవి ఈ రెండు టెస్టులే అంటే నమ్మగలరా?

- తన పుట్టిన రోజునాడు హ్యాట్రిక్‌ తీసుకున్న ఏకైక బౌలర్‌ పీటర్‌ సిడిల్‌. 2010, నవంబర్‌ 25న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో సిడిల్‌ ఈ హ్యాట్రిక్ తీసుకున్నాడు.

- హత్య కేసులో ఉరికంబం ఎక్కిన ఏకైక క్రికెటర్‌ వెస్టిండీస్‌కు చెందిన లెస్లీ హిల్టన్‌.

- ఇండియా తరఫున టెస్ట్‌ క్రికెట్‌లో ఇద్దరు రాబిన్‌ సింగ్‌లు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ఇద్దరికి తొలి టెస్ట్‌ తర్వాత మరో టెస్ట్‌ ఆడే అవకాశం రాలేదు.

తదుపరి వ్యాసం