Cricket Facts | ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆ రెండు మ్యాచ్‌లు.. ఎన్నో పోలికలు
27 January 2022, 21:03 IST
- రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియా దాయాది పాకిస్థాన్ తోనే తన తొలి మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో జరిగిన రెండు మ్యాచ్ లలో ఉన్న కొన్ని పోలికల గురించి ఇప్పుడు చూద్దాం. 1985లో జరిగిన మ్యాచ్ ఒకటి కాగా.. 2014లో జరిగిన ఏషియా కప్ మ్యాచ్ మరొకటి. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 12 పోలికలు ఉండటం విశేషం.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో అభిమానులు
క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది క్రికెట్ మైదానంలో జరిగే యుద్ధంగా అభిమానులు భావిస్తారు. ఈ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాల అభిమానులకే కాదు.. మొత్తం క్రికెట్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా, బ్రెజిల్ వైరం ఎలాగో.. క్రికెట్‌లో ఈ దాయాదుల పోరు కూడా అంతే.
అయితే ఇండియా, పాకిస్థాన్ మధ్య సుమారు 30 ఏళ్ల గ్యాప్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు అచ్చూ ఒకేలాగా సాగిన విషయం చాలా మంది క్రికెట్ అభిమానులకు కూడా తెలియదు. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. 1985లో జరిగిన మ్యాచ్ ఒకటి కాగా.. 2014లో జరిగిన ఏషియా కప్ మ్యాచ్ మరొకటి. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 12 పోలికలు ఉండటం విశేషం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ 12 పోలికలు ఇవే..
- ఈ రెండు మ్యాచ్‌లూ తటస్థ వేదికలోనే జరిగాయి.
- రెండు మ్యాచ్‌లలోనూ పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
- మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా రెండు మ్యాచ్‌లలోనూ సరిగ్గా 245 పరుగులే చేసింది.
- 1985లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు బాదాడు. ఇక 2014లో ఏషియాకప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కూడా 2 సిక్స్‌లే కొట్టడం విశేషం.
- ఈ రెండు మ్యాచ్‌లలోనూ ముగ్గురేసి ఇండియన్ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు చేశారు.
- ఇక పాకిస్థాన్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే 1985 మ్యాచ్‌లోనూ, 2014 మ్యాచ్‌లోనూ ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు.
- 1985 మ్యాచ్‌లో పాకిస్థాన్ నంబర్ 10 బ్యాట్స్‌మన్ జుల్కమైన్.. చేతన్ శర్మ బౌలింగ్‌లో తొలి బాల్‌కే క్లీన్‌బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక 2014 ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ నంబర్ 10 బ్యాట్స్‌మన్ సయీద్ అజ్మల్ కూడా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో తొలి బాల్‌కే బౌల్డయి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
- 1985లో పాకిస్థాన్‌ను గెలిపించింది జావెద్ మియాందాద్ కాగా.. 2014లో షాహిద్ అఫ్రిది ఆ పని చేశాడు. ఆ మ్యాచ్‌లో మియాందాద్‌కు కీలకమైన సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు నంబర్ 11లో వచ్చిన బ్యాట్స్‌మన్ తౌసీఫ్. ఇక ఈ రెండో మ్యాచ్‌లో 11వ స్థానంలో వచ్చిన జునైద్ కూడా కీలకమైన సింగిల్ తీసి అఫ్రిదికి స్ట్రైక్ ఇచ్చాడు.
- 1985 మ్యాచ్‌లో ఇండియా తరఫున చేతన్ శర్మ 3 వికెట్లు తీశాడు. అతడే చివరి ఓవర్ వేశాడు. ఇక 2014 మ్యాచ్ ఇండియా తరఫున అశ్విన్ 3 వికెట్లు తీయడంతోపాటు చివరి ఓవర్ వేశాడు.
సిక్స్‌తో ముగిసిన మ్యాచ్‌లు
- అప్పుడు మియాందాద్ సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు. ఇన్నింగ్స్‌లో మొత్తం 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక తాజా మ్యాచ్‌లో అఫ్రిది కూడా సిక్స్‌తోనే పాక్‌ను గెలిపించాడు. ఇప్పుడు కూడా ఇన్నింగ్స్‌లో మొత్తం 3 సిక్స్‌లే ఉన్నాయి.
- ఈ రెండు మ్యాచ్‌లూ చివరి ఓవర్లోనే ముగిశాయి.
- 1985లో, 2014లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతోనే గెలిచింది.