Cricket World Records| అన్ని ఫార్మాట్‌లలో నమోదైన వరల్డ్ రికార్డులు ఇవే
24 January 2022, 20:51 IST
- Cricket World Records క్రికెట్లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నమోదైన వరల్డ్ రికార్డులన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే అత్యధిక స్కోర్లు, అత్యధిక సెంచరీలు, వికెట్లు, అత్యధిక భాగస్వామ్యాలు, వేగవంతమైన సెంచరీలు, హాఫ్ సెంచరీలు.. ఇలాంటి రికార్డులన్నీ ఇందులో ఉన్నాయి.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ
క్రికెట్ అనే కాదు ఏ స్పోర్ట్స్ అయినా రికార్డుల గురించి తెలుసుకోవాలని చాలా మంది అభిమానులు ఆసక్తి చూపుతారు. తమ అభిమాన ప్లేయర్స్ సాధించిన రికార్డుల గురించి కొందరు గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి Cricket World Records గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నమోదైన వరల్డ్ రికార్డులన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే అత్యధిక స్కోర్లు, అత్యధిక సెంచరీలు, వికెట్లు, అత్యధిక భాగస్వామ్యాలు, వేగవంతమైన సెంచరీలు, హాఫ్ సెంచరీలు.. ఇలాంటి రికార్డులన్నీ ఇందులో ఉన్నాయి. ఒక్కో ఫార్మాట్‌లో నమోదైన రికార్డులను విడివిడిగా ఇప్పుడు చూద్దాం.
టెస్ట్ క్రికెట్ రికార్డులు
- టెస్టుల్లో ఓ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 952. 1997లో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక ఈ వరల్డ్ రికార్డు స్కోరు సాధించింది. ఏకంగా 271 ఓవర్ల పాటు సాగిన లంక ఇన్నింగ్స్‌లో జయసూర్య ట్రిపుల్ సెంచరీ, మహనామా డబుల్ సెంచరీలు చేశారు.
- టెస్టుల్లో ఓ టీమ్ సాధించిన అత్యల్ప స్కోరు 26. ఇంగ్లండ్‌తో 1955లో జరిగిన టెస్ట్‌లో న్యూజిలాండ్ 27 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌటైంది.
- ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 400. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.
- టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతడు 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు.
- టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీల రికార్డు కూడా సచిన్ పేరిటే ఉంది. మాస్టర్ బ్లాస్టర్ మొత్తం 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు చేశాడు.
- ఇక టెస్టుల్లో 12 డబుల్ సెంచరీలతో బ్రాడ్‌మన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రెండేసి ట్రిపుల్ సెంచరీలతో ఇదే బ్రాడ్‌మన్ సరసన నిలిచారు సెహ్వాగ్, క్రిస్ గేల్, బ్రియాన్ లారా.
- టెస్టుల్లో కేవలం 54 బంతుల్లోనే సెంచరీ చేసి వేగవంతమైన సెంచరీ రికార్డును నమోదు చేసుకున్నాడు న్యూజిలాండ్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్. ఇక ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్ కలిస్ పేరిట ఉంది. అతడు కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
- టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం 624 పరుగులు. 2006లో సౌతాఫ్రికాపై శ్రీలంక బ్యాట్స్‌మెన్ సంగక్కర, జయవర్దెనే మూడో వికెట్‌కు ఈ వరల్డ్‌రికార్డు పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.
- టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 800 వికెట్లు తీయడం విశేషం.
- ఇక టెస్ట్ క్రికెట్ ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన బౌలర్లు ముగ్గురు ఉన్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్, ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఈ మధ్యే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసుకున్నారు.
- టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. అతడు 164 టెస్టుల్లో 210 క్యాచ్‌లు అందుకున్నాడు.
వన్డే క్రికెట్ రికార్డులు
- వన్డేల్లో ఓ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 481. ఆస్ట్రేలియాతో 2018 లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇంత భారీ స్కోరు సాధించింది.
- ఇక వన్డేల్లో ఓ టీమ్ సాధించిన అత్యల్ప స్కోరు 35. శ్రీలంకతో 2004లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 35 పరుగులకే ఆలౌటైంది.
- వన్డేల్లో ఓ బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 264. శ్రీలంకతో 2014లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ స్కోరు చేశాడు.
- వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. అతడు మొత్తం 463 వన్డేల్లో 18426 పరుగులు చేశాడు.
- వన్డేల్లో అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కూడా సచిన్‌దే. మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
- డబుల్ సెంచరీల విషయంలో మాత్రం రోహిత్ శర్మ ముందున్నాడు. అతడు వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు.
- వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం 372 పరుగులు. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ప్లేయర్స్ క్రిస్ గేల్, మార్లన్ శామ్యూల్స్ రెండో వికెట్‌కు ఈ రికార్డు పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.
- వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతడు 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
- ఇక ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా అదే మ్యాచ్‌లో డివిలియర్స్ 16 బంతుల్లో సాధించి రికార్డు నమోదు చేశాడు.
- వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు కూడా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 350 వన్డేల్లో 534 వికెట్లు తీశాడు.
- ఒక వన్డేలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ శ్రీలంక పేసర్ చమిందా వాస్. అతడు 2001లో జింబాబ్వేపై 8 వికెట్లు తీసుకున్నాడు.
- వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ మహేళ జయవర్దెనే (218) కాగా.. అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (417).
టీ20 క్రికెట్ రికార్డులు
- టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 278. ఐర్లాండ్‌తో 2019లో జరిగిన టీ20ల్లో ఆఫ్ఘనిస్థాన్ ఈ రికార్డు స్కోరు సాధించింది.
- టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక టీమ్ సాధించిన అత్యల్ప స్కోరు 21. చెక్ రిపబ్లిక్‌తో 2019లో జరిగిన మ్యాచ్‌లో టర్కీ ఈ స్కోరు చేసింది.
- టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు 172. ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ 2018లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు.
- టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది. అతడు 2017లో బంగ్లాదేశ్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
- అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్ న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్. అతడు 165 సిక్స్‌లు కొట్టాడు.