తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lord's | లార్డ్స్‌ను మక్కా ఆఫ్‌ క్రికెట్‌ అని ఎందుకంటారు? కొన్ని ఆసక్తికర విషయాలు

Lord's | లార్డ్స్‌ను మక్కా ఆఫ్‌ క్రికెట్‌ అని ఎందుకంటారు? కొన్ని ఆసక్తికర విషయాలు

Hari Prasad S HT Telugu

24 January 2022, 20:46 IST

google News
    • Lord's.. కెరీర్‌ మొత్తంలో ఇక్కడ కనీసం ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ అయినా ఆడాలని కలలు కనని క్రికెటర్‌ ఉండడు. అలాగే ఈ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరని క్రికెట్ అభిమానీ ఉండడు. అలాంటి లార్డ్స్‌ను హోమ్‌ ఆఫ్‌ క్రికెట్‌ లేదా మక్కా ఆఫ్‌ క్రికెట్‌గా చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు.
లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం
లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం (Reuters)

లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం

లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.. క్రికెట్‌ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో ఉన్న ప్రతిష్టాత్మక మైదానమిది. ప్రపంచంలో ఎన్నో ప్రముఖ క్రికెట్‌ స్టేడియాలు ఉన్నా.. లార్డ్స్‌ స్థానం ప్రత్యేకం. తన కెరీర్‌ మొత్తంలో ఇక్కడ కనీసం ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ అయినా ఆడాలని కలలు కనని క్రికెటర్‌ ఉండడు. అలాగే ఈ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరని క్రికెట్ అభిమానీ ఉండడు. 

అలాంటి లార్డ్స్‌ను హోమ్‌ ఆఫ్‌ క్రికెట్‌ లేదా మక్కా ఆఫ్‌ క్రికెట్‌గా చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. మరి ఈ గ్రౌండ్‌ను అలా ఎందుకు పిలుస్తారు? అసలు ఈ గ్రౌండ్‌కు లార్డ్స్‌ అనే పేరు ఎలా వచ్చింది? వీటితోపాటు లార్డ్స్‌ గురించి క్రికెట్‌ అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్న ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

తొలి అధికారిక గ్రౌండ్ ఇదే

- లార్డ్స్‌ను మక్కా ఆఫ్‌ క్రికెట్‌ లేదా హోమ్‌ ఆఫ్‌ క్రికెట్‌ అని ఎందుకు పిలుస్తారంటే.. ప్రపంచంలో కేవలం క్రికెట్‌ ఆడటం కోసం తొలిసారి అధికారికంగా నిర్మించిన గ్రౌండ్‌ ఇదే. లండన్‌లోని సెయింట్ జాన్స్‌ వుడ్‌లో ఈ గ్రౌండ్‌ ఉంది.

- ఈ గ్రౌండ్‌ను నిర్మించిన థామస్ లార్డ్‌ పేరు మీదుగానే ఈ స్టేడియానికి లార్డ్స్‌ అనే పేరు వచ్చింది.

- మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) దీనికి యజమాని. ఇక మిడిల్‌సెక్స్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌తోపాటు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), యురోపియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లకు ఈ లార్డ్స్‌ గ్రౌండే ప్రధాన కేంద్రం.

- నిజానికి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రధాన కార్యాలయం కూడా 2005 వరకూ లార్డ్స్‌లోనే ఉండేది. ఆ తర్వాత దానిని దుబాయ్‌కు తరలించారు.

- లార్డ్స్‌లోని ఎంసీసీ మ్యూజియం.. ప్రపంచంలో అత్యంత పురాతన స్పోర్ట్స్‌ మ్యూజియం కావడం విశేషం. ఇందులో యాషెస్‌ అర్న్‌తోపాటు క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో జ్ఞాపికలు ఇందులో ఉన్నాయి.

- థామస్‌ లార్డ్‌ 1787 నుంచి 1814 మధ్య మొత్తం మూడు గ్రౌండ్‌లను నిర్మించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్నదే చివరిగా నిర్మించినది. తొలి గ్రౌండ్‌ను లార్డ్స్‌ ఓల్డ్‌ గ్రౌండ్‌గా పిలుస్తారు.

- లార్డ్స్‌ గ్రౌండ్‌ 200 ఏళ్ల సంబురాలను పురస్కరించుకొని 2014, జులై 5న ఇదే గ్రౌండ్‌లో ఎంసీసీ లెవన్‌, వరల్డ్ లెవన్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ఎంసీసీ టీమ్‌కు సచిన్‌, వరల్డ్‌ లెవన్‌కు షేన్‌ వార్న్‌ కెప్టెన్‌గా ఉండటం విశేషం.

- లార్డ్స్‌లో 2007 నుంచి ప్రతి టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ అవకాశం దక్కడాన్ని చాలా గొప్ప గౌరవంగా మాజీ క్రికెటర్లు భావిస్తారు. ఇలా గంట మోగించడం కోసం ఆ మ్యాచ్‌లో తలపడుతున్న ప్రత్యర్థి టీమ్‌కు చెందిన మాజీ క్రికెటర్లను కూడా ఆహ్వానిస్తారు.

- ఇక్కడి ఎంసీసీ లైబ్రరీ కూడా చాలా చాలా పెద్దది. కేవలం క్రికెట్‌కు చెందిన సుమారు 17 వేలకుపైగా పుస్తకాలు లార్డ్స్‌లోని ఎంసీసీ లైబ్రరీలో ఉన్నాయి.

ఆధునిక హంగులు

- ఈ గ్రౌండ్‌ నిర్మించి 200 ఏళ్లు అయిన సందర్భంగా 2013-14 సమయంలో దీనికి ఆధునిక హంగులను అద్దారు.

- లార్డ్స్‌లోని రాయల్ బాల్కనీతో ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ బాల్కనీలోనే కపిల్‌ దేవ్ తొలిసారి ప్రపంచకప్‌ అందుకోగా.. 2002లో ఇంగ్లండ్‌పై నాట్‌వెస్ట్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత అప్పటి కెప్టెన్‌ గంగూలీ తన షర్ట్‌ విప్పి సంబరాలు చేసుకున్నాడు.

- లార్డ్స్‌లో రెండు టీమ్స్‌ కోసం ఉన్న డ్రెస్సింగ్ రూమ్స్‌లో హానర్‌ బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులపై ఇక్కడ ఇప్పటి వరకూ జరిగిన ప్రతి టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌, ఒక ఇన్నింగ్స్‌లో 5, మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ల పేర్లు ఉంటాయి. లార్డ్స్‌ హానర్‌ బోర్డుపై తమ పేరు ఎక్కడాన్ని ఎంతో గొప్ప గౌరవంగా ప్రతి క్రికెటర్‌ భావిస్తాడు.

- లార్డ్స్‌ ఔట్‌ఫీల్డ్‌ కాస్త భిన్నంగా, ఓవైపు ఏటవాలుగా ఉంటుంది. గ్రౌండ్‌లోని వాయువ్య భాగంతో పోలిస్తే నైరుతి భాగం రెండున్నర మీటర్లు వాలుగా ఉండటం విశేషం.

- లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. 1934 నుంచి 2009 వరకూ 76 ఏళ్ల పాటు ఇంగ్లండ్‌తో ఈ గ్రౌండ్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌ ఆస్ట్రేలియా గెలిచింది. 2009లో తొలిసారి యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలిచింది.

- లార్డ్స్‌ కేవలం క్రికెట్‌ కోసమే నిర్మించిన స్టేడియం అయినా కూడా ఇక్కడ ఓ టెన్నిస్‌ కోర్టు కూడా ఉంది. అంతేకాదు తొలి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ గ్రౌండ్‌ అమెరికా, కెనడాల మధ్య జరిగిన ఓ ఛారిటీ బేస్‌బాల్‌ మ్యాచ్‌కు కూడా ఆతిథ్యమిచ్చింది.

- లార్డ్స్‌ పాత క్రికెట్‌ గ్రౌండ్‌లో 1805 నుంచి ప్రతి ఏటా ఇటాన్‌ కాలేజ్‌, హారో స్కూల్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతూ వస్తుండటం విశేషం.

తదుపరి వ్యాసం