Cricket Terminology | క్రికెట్‌లో వాడే ఈ పదాలకు అర్థమేంటో తెలుసా?
24 January 2022, 21:15 IST
- క్రికెట్ అయితే మరీ వింతగా ఉంటుంది. ఎప్పుడూ కొత్త కొత్త పదాలు వినిపిస్తూనే ఉంటాయి. కొత్తగా క్రికెట్‌ను చూస్తున్న వాళ్లకైనా, ఎన్నో ఏళ్లుగా ఈ గేమ్‌ను ఫాలో అవుతున్న వాళ్లకైనా వీటిలో కొన్ని పదాలు ఇప్పటికీ కాస్త అయోమయానికి గురి చేస్తాయి. క్రికెట్ కామెంటేటర్లు ఇలాంటి కొత్త పదాలను వినిపిస్తూనే ఉంటారు.
క్రికెట్ స్టేడియం
Cricket Terminology.. క్రికెట్ గురించి మరింత లోతుగా తెలియాలంటే.. ముందుగా అందులో వాడే పదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి క్రికెట్ అనే కాదు ఏ ఆట గురించి అయినా లోతైన అవగాహన రావాలంటే ముందుగా ఆ స్పోర్ట్స్ టెర్మినాలజీని తెలుసుకోవాలి. అందులోనూ క్రికెట్ అయితే మరీ వింతగా ఉంటుంది. ఎప్పుడూ కొత్త కొత్త పదాలు వినిపిస్తూనే ఉంటాయి.
కొత్తగా క్రికెట్‌ను చూస్తున్న వాళ్లకైనా, ఎన్నో ఏళ్లుగా ఈ గేమ్‌ను ఫాలో అవుతున్న వాళ్లకైనా వీటిలో కొన్ని పదాలు ఇప్పటికీ కాస్త అయోమయానికి గురి చేస్తాయి. క్రికెట్ కామెంటేటర్లు ఇలాంటి కొత్త పదాలను వినిపిస్తూనే ఉంటారు. ఇందులో ప్రతి మ్యాచ్‌లోనూ వినిపించే పదాలు కొన్నయితే.. మరికొన్ని అప్పుడప్పుడూ వినిపించి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి పదాలు ఏంటి? వాటికి అర్థమేంటో మీరూ తెలుసుకోండి.
స్టికీ వికెట్ : క్రికెట్‌లో పిచ్‌నే వికెట్ అని కూడా అంటారని తెలుసు కదా. ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు గురి చేస్తూ అనూహ్యంగా వ్యవహరించే సమయాల్లో ఈ స్టికీ వికెట్ అనే పదాన్ని వాడతారు. సాధారణంగా వర్షం పడిన తర్వాత క్రికెట్ పిచ్ అనూహ్యంగా మారిపోతుంది. 1880ల్లో తొలిసారి ఈ పదాన్ని ఉపయోగించగా.. 1950ల నుంచి రెగ్యులర్‌గా ఈ పదం వినిపిస్తూ ఉంది.
క్యారమ్ బాల్: క్యారమ్‌బోర్డ్‌లో స్ట్రైకర్‌తో కాయిన్స్‌ను కొట్టే సమయంలో మనం వేళ్లను ఎలా పెడతాం? బొటనవేలు, మధ్య వేలును కలుపుతాం కదా. అలా క్రికెట్ బాల్‌ను ఈ రెండు వేళ్లతో పట్టుకొని స్పిన్ చేయడాన్ని క్యారమ్ బాల్ అంటారు.
ఆర్మ్ బాల్: ఓ స్పిన్నర్ ఎలాంటి స్పిన్ చేయకుండా బంతిని నేరుగా బౌల్ చేయడాన్ని ఆర్మ్ బాల్ అంటారు.
బాల్ టాంపరింగ్
క్రికెట్‌లో బాల్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతినేలా చేయడమే బాల్ టాంపరింగ్. బాల్‌ను కొందరు కావాలని దెబ్బతీస్తుంటారు. దీని కారణంగా పేస్ బౌలర్లకు స్వింగ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. బాల్‌కు చెమట లేదా లాలాజలం కాకుండా ఇతర పదార్థాలు రాయడం, బంతిపై ఉన్న సీమ్‌ను తొలగించే ప్రయత్నం చేయడం, బంతిని గ్రౌండ్‌పై వేసి కాలితో బలంగా తొక్కడం వంటివి టాంపరింగ్‌లో భాగంగా చేస్తారు.
బీమర్ : ఓ బౌలర్ విసిరిన బంతి బౌన్స్ అవకుండా ప్రమాదకర రీతిలో బ్యాట్స్‌మన్‌పైకి దూసుకొస్తే దానిని బీమర్ అంటారు. ఒక్కోసారి ఈ బాల్స్ వేగంగా బ్యాట్య్‌మెన్ తలపైకి కూడా దూసుకొస్తాయి. వీటిని అంపైర్లు నోబాల్స్‌గా ప్రకటిస్తారు.
బెల్టర్ : బౌలర్లకు ఏమాత్రం అనుకూలించకుండా, బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన పిచ్‌ను బెల్టర్ అంటారు.
బన్నీ లేదా రాబిట్: ఓ క్రికెట్ టీమ్‌లో బ్యాటింగ్ చేయలేని స్పెషలిస్ట్ బౌలర్ లేదా వికెట్ కీపర్‌గా ఉన్న ప్లేయర్‌ను బన్నీ అంటారు. ఈ ప్లేయర్ చాలా వరకూ 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఇక ఒకే బౌలర్ బౌలింగ్‌లో పదే పదే ఔటయ్యే బ్యాట్స్‌మన్‌ను కూడా బన్నీ అని పిలుస్తారు.
బన్సెన్: స్పిన్ బౌలర్లకు విపరీతంగా సహకరించే పిచ్‌ను బన్సెస్ అని అంటారు.
క్యారీ యువర్ బ్యాట్: ఓ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఓ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ ఔటైనా కూడా తాను చివరి వరకూ నాటౌట్‌గా ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడతారు.
ఛార్జ్: సాధారణంగా స్పిన్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడటాన్ని ఇలా పిలుస్తారు.
చైనామన్: ఓ లెఫ్టామ్ లెగ్‌స్పిన్నర్‌ను చైనామన్ అని పిలుస్తుంటారు. అంటే లెఫ్టామ్ స్పిన్నర్ వేసే బాల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ నుంచి దూరంగా వెళ్లకుండా లోపలికి టర్న్ అవుతుంది.
చిన్ మ్యూజిక్: బ్యాట్స్‌మెన్ తలనే లక్ష్యంగా చేసుకొని ఫాస్ట్ బౌలర్లు వేసే బాల్స్ వేయడాన్ని చిన్ మ్యూజిక్ అంటారు. కరీబియన్ నుంచి ఈ పదం పుట్టింది.
చకర్: క్రికెట్ నిబంధనలకు విరుద్ధంగా బౌలర్ త్రో చేస్తే అతన్ని చకర్‌గా పిలుస్తారు.
కౌ కార్నర్: క్రికెట్‌లో అరుదుగా కనిపించే ఫీల్డింగ్ పొజిషన్ ఇది. సాధారణంగా మిడ్‌వికెట్/లాంగాన్ బౌండరీ దగ్గర ఉండే ఫీల్డర్. ఈ పదం డల్విచ్ కాలేజ్ నుంచి వచ్చింది. అక్కడి గ్రౌండ్‌లో ఓ మూల పశుగ్రాసం ఉండేది. అలా ఆ పొజిషన్‌కు కౌ కార్నర్ అనే పేరు వచ్చింది.
దూస్రా: హిందీలో దూస్రా అంటే రెండోది లేదా మరొకటి అని అర్థం. ఓ ఆఫ్ స్పిన్నర్ వేసే బాల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ లోనికి స్పిన్ కావాలి. కానీ ఈ దూస్రా మాత్రం దూరంగా వెళ్తుంది. అంటే ఓ ఆఫ్ స్నిన్నర్ లెగ్ స్పిన్ చేయడం.
ఫ్లిప్పర్: లెగ్ స్పిన్నర్ అస్త్రాల్లో ఒకటి ఈ ఫ్లిప్పర్. బాల్ షార్ట్ పిచ్ అయి వేగంగా బ్యాట్స్‌మన్ వైపు దూసుకొస్తుంది. ఈ బాల్‌ను ఆడలేక బ్యాట్స్‌మన్ తరచూ బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూగా ఔటవుతారు.
గుడ్ లెంత్
ఓ బౌలర్‌పై పిచ్‌పై కచ్చితంగా బాల్‌ను బౌన్స్ చేయాలనుకునే ఏరియా. ఇలాంటి బాల్స్ ఆడటం బ్యాట్స్‌మెన్‌కు సవాలే. ఈ బాల్స్‌ను ముందుకు వచ్చి ఆడాలా లేదంటే వెనక్కి వెళ్లాల అనేది తేల్చుకోలేక బ్యాట్స్‌మెన్ సతమతమవుతారు.
గూగ్లీ: ఆఫ్ స్పిన్నర్‌కు దూస్రా ఎలాగో లెగ్ స్పిన్నర్‌కు గూగ్లీ అలా అని చెప్పొచ్చు. ఈ గూగ్లీ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు లోనికి దూసుకొస్తుంది. లెఫ్ట్ హాండ్ బ్యాట్స్‌మన్‌కు దూరంగా వెళ్తుంది.
గ్రబ్బర్: పిచ్‌పై పడిన తర్వాత బంతి చాలా తక్కువ ఎత్తులో బౌన్స్ అయితే దాని గ్రబ్బర్ అంటారు.
హాఫ్ వాలీ: బ్యాట్స్‌మన్ డ్రైవ్ షాట్ ఈజీగా ఆడేందుకు వీలయ్యే బాల్ ఇది. గుడ్ లెంత్ కంటే బ్యాట్స్‌మన్‌కు ఇంకాస్త దగ్గరగా బంతి పిచ్ అవుతుంది.
ఇన్‌సైడ్ ఔట్ షాట్: ఓ బ్యాట్స్‌మన్ లెగ్ స్టంప్ వైపు జరిగి లెగ్ స్టంప్‌పై పడిన బంతిని ఆఫ్‌సైడ్‌కు తరలిస్తే దానిని ఇన్‌సైడ్ ఔట్ షాట్ అంటారు.
జఫ్ఫా: బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందికి గురి చేసే బాల్‌ను జఫ్ఫా అంటారు. ఈ బాల్‌ను బ్యాట్స్‌మెన్ అతి కష్టమ్మీద వదిలేస్తారు లేదంటే ఔటవుతారు.
కింగ్ పెయిర్: ఒక టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ ఓ బ్యాట్స్‌మన్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగితే కింగ్ పెయిర్ అంటారు.
కోల్‌పాక్ డీల్: యురోపియన్ యూనియన్ క్రికెట్‌లో విధించిన నిబంధన ఇది. దీని కారణంగా ఇంగ్లండ్ టీమ్‌కు అర్హత లేని ప్లేయర్స్ ఎంతో మంది ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది. వీళ్లను విదేశీ ప్లేయర్స్‌గా కూడా పరిగణించరు.
లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ)
ఓ బ్యాట్స్‌మన్ బంతిని ఆడబోయే క్రమంలో అది బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తగిలిన సమయంలో ఆ బంతి వికెట్లను తాకుతుందని అంపైర్ నిర్ధారించుకుంటే ఔట్‌గా ప్రకటిస్తారు. లెగ్ స్టంప్ బయట బంతి పిచ్ అయితే అది వికెట్లకు తగులుతున్నా, లేకపోయినా నాటౌట్‌గా ప్రకటిస్తారు. ఇక బంతి ఆఫ్‌స్టంప్ బయట బ్యాట్స్‌మన్ ప్యాడ్‌కు తగిలినా నాటౌట్‌గా ఇస్తారు. బంతి లైన్‌లో ఉండి, స్టంప్స్‌ను తగులుతుందనుకుంటే మాత్రం ఔట్.
లెగ్‌బై: ఓ బ్యాట్స్‌మన్ షాట్ ఆడే క్రమంలో బంతి అతను/ఆమె బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్ లేదా శరీరానికి తగిలి వెళ్లిన సమయంలో బ్యాట్స్‌మన్ పరుగు తీస్తే దానిని లెగ్‌బైగా ప్రకటిస్తారు.
లాలీపాప్: ఓ బ్యాట్స్‌మన్ ఎలాంటి శ్రమ లేకుండా చాలా సులువుగా కొట్టగలిగే బంతిని లాలీపాప్ అంటారు.
నెల్సన్: క్రికెట్‌లో ఒకే అంకె మూడుసార్లు వచ్చిన స్కోరును దురదృష్టంగా భావిస్తారు. అంటే స్కోరు 111, 222.. ఇలా ఉన్న సమయంలో వికెట్ పడుతుందన్న ఓ మూఢనమ్మకం క్రికెట్‌లో పాతుకుపోయింది.
ఔట్‌స్వింగ్: ఓ పేస్ బౌలర్ విసిరే బంతి పిచ్ అయిన తర్వాత బ్యాట్స్‌మెన్ నుంచి దూరంగా స్లిప్స్ వైపు వెళ్తే దానిని ఔట్‌స్వింగ్ అంటారు.
రివర్స్ స్వింగ్: సాధారణంగా క్రికెట్‌లో కొత్త బాల్ స్వింగ్ అవుతుంది. కానీ బంతి 50 ఓవర్లు పాతబడిన తర్వాత స్వింగ్ అయితే దానిని రివర్స్ స్వింగ్ అంటారు. 1980, 90ల్లో పాకిస్థాన్ పేస్ బౌలర్లు ఈ రివర్స్ స్వింగ్‌పై పట్టు సాధించారు.
పించ్-హిట్టర్: సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చే బ్యాట్స్‌మన్ను ప్రమోట్ చేసి ఆర్డర్‌లో పైన పంపిస్తారు. సాధ్యమైనంత వేగంగా పరుగులు చేయడమే ఈ బ్యాట్స్‌మన్ పని. ఇతన్నే పించ్ హిట్టర్ అని అంటారు.
ప్లంబ్: ఓ బ్యాట్స్‌మన్ స్పష్టంగా వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా ఔటవడం.
స్లాగ్: క్రికెట్ కోచింగ్ బుక్‌లో లేని ఓ వింత్ షాట్‌ను ఆడటాన్ని స్లాగ్‌గా కామెంటేటర్లు పిలుస్తుంటారు.
స్టాక్ బాల్: ఓ బౌలర్ సాధారణంగా వేసే బాల్. అంటే ఇలాంటి బాల్స్‌కు రన్స్ రావడం, వికెట్లు తీయడం చాలా అరుదుగా జరుగుతుంది.
టాన్: క్రికెట్‌లో సెంచరీనే టాన్ అని కూడా పిలుస్తారు.
టెయిలెండర్: బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరన అంటే 8, 9, 10, 11 స్థానాల్లో వచ్చే ప్లేయర్స్‌ను టెయిలెండర్లు అంటారు.