క్రికెట్ కెరీర్‌లో చివరి బంతికి వికెట్ తీసిన బౌలర్లు వీళ్లే
24 January 2022, 20:28 IST
- అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం ఒక్క ఫార్మాట్‌లో అయినా తాము ఆడుతున్న చివరి మ్యాచ్ చివరి బంతికి వికెట్ తీసిన బౌలర్లు ఐదు మంది ఉండటం విశేషం. అంతేకాదు అన్ని ఫార్మాట్లలోనూ తాను వేసిన చివరి బంతికి వికెట్ తీసిన ఏకైక బౌలర్ కూడా ఉన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్
క్రికెట్‌లో ఏ బౌలర్‌కైనా తన కెరీర్‌లో సాధించిన తొలి వికెట్, చివరి వికెట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందులోనూ అంతర్జాతీయ కెరీర్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్, తొలి బంతికే వికెట్ తీయడం, చివరి మ్యాచ్ చివరి బంతికి వికెట్ తీయడం వంటి అత్యంత అరుదైన ఘనతలు ఎంతో మధురమైనవి.
ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం ఒక్క ఫార్మాట్‌లో అయినా తాము ఆడుతున్న చివరి మ్యాచ్ చివరి బంతికి వికెట్ తీసిన బౌలర్లు ఐదు మంది ఉండటం విశేషం. అంతేకాదు అన్ని ఫార్మాట్లలోనూ తాను వేసిన చివరి బంతికి వికెట్ తీసిన ఏకైక బౌలర్ కూడా ఉన్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన ఆ బౌలర్లెవరో ఇప్పుడు చూద్దాం.
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
ప్రపంచ క్రికెట్ చూసిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌కు మారుపేరు. ఆఫ్‌స్టంప్ లక్ష్యంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఉచ్చులో బిగించే బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. అతడు ప్రపంచంలో ఏ ఇతర బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. మెక్‌గ్రాత్ మూడు ఫార్మాట్‌లలోనూ తాను వేసిన చివరి బంతికి వికెట్ తీయడం విశేషం. 2007, జనవరి 5న తాను ఆడిన చివరి టెస్ట్‌లో చివరి బంతికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ ఆండర్సన్ వికెట్ తీశాడు మెక్‌గ్రాత్. అలాగే వన్డే, టీ20ల్లోనూ తాను వేసిన చివరి బంతికి మెక్‌గ్రాత్ వికెట్ తీసుకున్నాడు. ఈ రికార్డు ఇప్పటి వరకూ మరే ఇతర బౌలర్‌కూ సాధ్యం కాలేదు.
రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్)
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు, తాను రిటైరయ్యే సమయానికి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (431) తీసిన బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ. అంతేకాదు వన్డే క్రికెట్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా కూడా అతని పేరిట రికార్డు ఉంది. హ్యాడ్లీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1990లో ఇంగ్లండ్‌తో ఆడాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ చివరి బ్యాట్స్‌మన్ డెవోన్ మాల్కమ్‌ను హ్యాడ్లీ ఔట్ చేశాడు. అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేసిన చివరి బంతి ఇదే కావడం విశేషం.
లసిత్ మలింగా (శ్రీలంక)
రంగురంగుల జులపాల జుట్టు, విలక్షణమైన బౌలింగ్ శైలితో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు శ్రీలంక మాజీ పేస్ బౌలర్ లసిత్ మలింగా. యార్కర్లు వేయడంలో దిట్ట. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు హ్యాట్రిక్‌లు తీసిన అరుదైన ఘనతనూ సొంతం చేసుకున్నాడు. రెండుసార్లు వరుసగా నాలుగు వికెట్లు తీసిన రికార్డూ ఉంది. అలాంటి మలింగా.. 2019, జులై 26న బంగ్లాదేశ్‌తో తాను ఆడిన చివరి వన్డే, చివరి బంతికి వికెట్ తీశాడు.
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)
టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. మొత్తం 1347 అంతర్జాతీయ వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. 2010లో ఇండియాతో చివరి టెస్ట్ ఆడిన మురళీధరన్.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రజ్ఞాన్ ఓజా వికెట్ తీసి ఇండియా ఇన్నింగ్స్ ముగించాడు. ఆ వికెట్‌తోనే టెస్టుల్లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచి క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)
బౌలర్ల లిస్ట్‌లో ఈ స్టార్ వికెట్ కీపర్ పేరు కనిపించడం ఆశ్చర్యం కలిగించేదే. ప్రొఫెషనల్ క్రికెట్‌లో గిల్‌క్రిస్ట్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది కూడా కెరీర్ చివరి బంతికి కావడం విశేషం. 2013 ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌క్రిస్ట్.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ హర్భజన్ వికెట్ తీశాడు.