తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ టెలికాస్ట్‌ కోసం ఎన్ని కెమెరాలు వాడతారో తెలుసా?

క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ టెలికాస్ట్‌ కోసం ఎన్ని కెమెరాలు వాడతారో తెలుసా?

Hari Prasad S HT Telugu

24 January 2022, 20:28 IST

google News
    • క్రికెట్‌ బాల్‌ను ఎప్పుడూ కెమెరాలు ఛేజ్‌ చేసే తీరు అద్భుతం. అంతేకాదు ప్రతి బంతి పడిన తర్వాత దానిని అన్ని కోణాల్లో స్లోమోషన్‌లోనూ చూపిస్తారు. క్రికెట్‌ మ్యాచ్‌ను ఈ స్థాయిలో చూపించడానికి బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌ చాలానే శ్రమించాల్సి ఉంటుంది. ఎన్ని కెమెరాలు వాడుతారన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
క్రికెట్ స్టేడియం
క్రికెట్ స్టేడియం (Getty Images)

క్రికెట్ స్టేడియం

క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూడటం అంటే ఓ అద్భుతమైన అనుభూతి. ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి చూడటం కంటే టీవీలో మ్యాచ్‌ చూడటమే బాగుంటుందన్నది చాలా మంది చెప్పే మాట. క్రికెట్‌ గ్రౌండ్‌ను 360 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా క్రికెట్‌ బాల్‌ను ఎప్పుడూ కెమెరాలు ఛేజ్‌ చేసే తీరు అద్భుతం. అంతేకాదు ప్రతి బంతి పడిన తర్వాత దానిని అన్ని కోణాల్లో స్లోమోషన్‌లోనూ చూపిస్తారు. 

అయితే క్రికెట్‌ మ్యాచ్‌ను ఈ స్థాయిలో చూపించడానికి బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌ చాలానే శ్రమించాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు ముందే స్టేడియంలో భారీ ఎత్తున సరంజామాను సమకూర్చుకోవాలి. దీనికోసం స్టేడియంలో అసలు ఎన్ని కెమెరాలు వాడుతారన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? బౌలర్‌, బ్యాట్స్‌మెన్‌, ఫీల్డర్లు, ఆడియెన్స్‌ను చూపించడానికి ఎన్ని కెమెరాలు వాడతారు? డీఆర్‌ఎస్‌ కోసం వాడే టెక్నాలజీ కోసం ఎన్ని కెమెరాలు వాడుతారు అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

లైవ్‌ టెలికాస్ట్ కోసం వాడే కెమెరాలెన్ని?

ఓ క్రికెట్‌ మ్యాచ్‌ను లైవ్‌ టెలికాస్ట్‌ చేయడం కోసం ఓ బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌ సుమారు 30 కెమెరాల వరకూ వాడుతుంది. స్టేడియం నలుమూలలా ఈ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఫీల్డ్‌లో జరిగే ఆటను చూపించడానికి 12 కెమెరాలు వాడుతారు. బ్రాడ్‌కాస్టింగ్‌ స్టూడియో బయట ఒక కెమెరా ఉంటుంది. బాల్‌ను ట్రాక్‌ చేసే హాక్‌ఐ కెమెరాలు ఆరు ఉంటాయి. ఇక రనౌట్‌ వీడియోలను క్యాప్చర్‌ చేయడానికి ప్రత్యేకంగా 4 కెమెరాలను ఏర్పాటు చేస్తారు. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను చూపించడానికి రెండు కెమెరాలు, స్టంప్స్‌లో 4 కెమెరాలు, 1 ప్రజెంటేషన్‌ కెమెరా.. ఇలా మొత్తం 30 కెమెరాలను ఓ క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ టెలికాస్ట్‌ కోసం ఉపయోగిస్తారు.

ప్రధాన కెమెరా

స్టేడియంలో వికెట్‌కు రెండువైపులా స్ట్రైక్‌ జోన్‌ను చూపించడానికి ప్రధాన కెమెరా ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి. ఈ కెమెరాలు పిచ్‌ మధ్య నుంచి 90 నుంచి 110 మీటర్ల దూరంలో ఉంటాయి. ఈ కెమెరాలు ఓ బౌలర్‌ రనప్‌ నుంచి స్లిప్‌ ఫీల్డర్ల వరకూ కవర్‌ చేస్తుంది.

ఫీల్డ్‌ కెమెరాలు

ఇవి పోర్టబుల్‌ కెమెరాలు. మ్యాచ్‌కు ముందు, తర్వాత వినియోగిస్తారు. పిచ్‌ రిపోర్ట్‌, టాస్‌, కెప్టెన్ల ఇంటర్వ్యూలు, గ్రౌండ్‌లో కామెంటేటర్ల అనాలసిస్ కోసం ఈ ఫీల్డ్‌ కెమెరాలు ఉంటాయి.

రనౌట్‌ కెమెరాలు

ఈ రనౌట్‌ కెమెరాలనే థర్డ్ అంపైర్‌ కెమెరాలు అంటారు. ఇవి ఉపరితలం నుంచి 6 నుంచి 8 మీటర్ల ఎత్తులో, బౌండరీ రోప్‌ బయట 20 నుంచి 25 మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు. ఇవి కంప్యూటరైజ్డ్‌ కెమెరాలు. ప్రత్యేకంగా రనౌట్లను పరిశీలించడం కోసమే ఇలాంటి నాలుగు కెమెరాలు ఉంటాయి.

హాక్‌ఐ కెమెరాలు

ఇవి అత్యాధునిక బాల్‌ ట్రాకింగ్‌ కంప్యూటరైజ్డ్‌ కెమెరాలు. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, టెన్నిస్‌లలోనూ ఈ హాక్‌ఐ కెమెరాలు వాడుతున్నారు. బాల్‌ పిచ్‌ అయిన తర్వాత కచ్చితంగా ఏ దిశలో వెళ్తుంతో తెలుసుకోవడానికి సెకనుకు 60 ఫ్రేమ్‌లను ఈ కెమెరాలు కంప్యూటర్‌కు పంపిస్తాయి. ప్రతి బాల్‌ను ట్రాక్‌ చేయడానికి మొత్తం ఆరు కెమెరాలను దీనికోసం వినియోగిస్తారు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో ఈ కెమెరాలదే కీలకపాత్ర. ఓ బాల్‌ ఎక్కడ పిచ్‌ అవుతోంది, అది బ్యాట్స్‌మన్‌ ప్యాడ్‌కు ఎక్కడ తగిలింది అంటే స్టంప్స్‌ బయటా, లోపలా.. ఆ బాల్‌ స్టంప్స్‌ను తగులుతుందా లేదా అన్నవి ఈ కెమెరాలు స్పష్టంగా చూపిస్తాయి.

 

తదుపరి వ్యాసం