Umran Malik: అప్పుడు సచిన్..ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ ఆట కోసం ఎదురుచూస్తున్నా...గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
14 June 2022, 11:13 IST
ఐపీఎల్‌లో రాణించి దిగ్గజ క్రికెటర్ల మన్ననల్ని అందుకుంటున్నాడు ఉమ్రాన్ మాలిక్. తాజాగా అతడిపై టీమ్ ఇండియా లెజెండ్ గవాస్కర్ ప్రశంసల్ని కురిపించాడు. ఇండియన్ ప్లేయర్స్ లో సచిన్ తర్వాత ఉమ్రాన్ మాలిక్ ఆటను చూసేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఉమ్రాన్ మాలిక్
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. బౌలింగ్ లోపాలు పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరుగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా లో భారీగా మార్పులు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐపీఎల్‌లో రాణించి ఈ సిరీస్ తోనే టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసిన స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌లకు తుది జట్టులో స్థానం దక్కనున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ పై మాజీ టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు టీమ్ ఇండియా క్రికెటర్లలో సచిన్ ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసేవాడినని గవాస్కర్ అన్నాడు. అతడి తర్వాత తనలో అంతగా ఆసక్తిని రేకెత్తించిన క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ అని తెలిపాడు. ఉమ్రాన్ మాలిక్ ను మూడో టీ20 మ్యాచ్ లో ఆడించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. ఉమ్రాన్ తప్పకుండా రాణిస్తాడనే నమ్మకముందని తెలిపాడు.
సేమ్ టీమ్ తో గెలిచి చూపించాలనే పట్టుదలకు పోవడం కంటే ప్రయోగాలు చేయడం మంచిదని గవాస్కర్ అన్నాడు. టీ20 సిరీస్ లో టీమ్ ఇండియాకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారిపోయిందని గవాస్కర్ అన్నాడు. భువనేశ్వర్, చాహల్ మినహా మిగిలిన బౌలర్లు వికెట్లు తీయడం లేదని పేర్కొన్నాడు. వారికి సహకారం అందించేవారు ఒక్కరూ కూడా కనిపించలేదని తెలిపాడు.
లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా తరచుగా వికెట్లు తీసినప్పుడే ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుందని తెలిపాడు. బౌలింగ్ లోపాల వల్లే భారీ స్కోర్లను కూడా టీమ్ ఇండియా కాపాడుకోలేకపోతున్నదని చెప్పాడు.