Gavaskar on Rohit Sharma: రోహిత్ కాస్త బ్రేక్ తీసుకో.. సునీల్ గవాస్కర్ సూచన
26 April 2023, 12:29 IST
- Gavaskar on Rohit Sharma: డబ్ల్యూటీసీకి ఫ్రెష్ మైండ్ సెట్‌తో వెళ్లాలంటే రోహిత్ శర్మ బ్రేక్ తీసుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో ముంబయి వరుస పరాజయాలు చవిచూస్తున్న వేళ విరామం అవసరమని ఆయన అన్నారు.
రోహిత్‌పై గవాస్కర్ రియాక్షన్
Gavaskar on Rohit Sharma: ఐపీఎల్ 2023 దాదాపు సగం పూర్తి కావచ్చుంది. ఇంక నెల రోజుల మాత్రమే టోర్నీకి సమయమున్న నేపథ్యంలో అన్ని జట్లు ప్లేఆఫ్స్ కోసం సన్నద్ధమవుతున్నాయి. అయితే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ మాత్రం వరుస పరాజయాలతో డీలా పడుతోంది. మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మను ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీమిండియా మాజీ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వరుస ఓటములతో ఒత్తిడి తీసుకుంటున్న హిట్ మ్యాన్.. విరామం తీసుకోవాలని, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‍కు ఫ్రెష్ మైండ్ సెట్‍తో వెళ్లలాని సూచించారు.
"రోహిత్ శర్మ కాస్త బ్రేక్ తీసుకుంటే మంచిది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతడు ఫ్రెష్ మైండ్ సెట్‌తో వెళ్లాలి. గత కొన్ని మ్యాచ్‌లకు పునరాగమనం చేసిన అతడు ప్రస్తుతానికి తనకోసం విరామం తీసుకోవాలి. చూస్తుంటే కాస్త ఒత్తిడితో ఉన్నట్లు అనిపిస్తోంది. బహుశా డబ్ల్యూటీసీ గురించి ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి బ్రేక్ తీసుకోవడం ఉత్తమం" అని గవాస్కర్ అన్నారు.
ముంబయి ఇండియన్స్ వరుస పరాజాయలపై గవాస్కర్ స్పందించారు. "ముంబయి ప్లేఆఫ్స్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాలంటే అసాధారణ ఆటతీరును కనబర్చాలి. బౌలర్లు పదే పదే అవే తప్పులు చేస్తున్నప్పుడు కాస్త బ్రేక్ ఇవ్వండి. అనంతరం తిరిగి అధ్యయనం చేయాలి. ఎక్కడ తప్పుగా బౌలింగ్ చేశారో గుర్తించాలి" అని గవాస్కర్ ముగించారు.
గుజరాత్‌పై ముంబయి 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 152 పరుగులకే పరిమితమైంది. నేహాల్(40), కేమరూన్ గ్రీన్(33) మినహా మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో విజృంభించగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.