Sumit Nagal in Australian Open: సుమిత్ నాగల్ సంచలనం.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అర్హత
12 January 2024, 13:27 IST
- Sumit Nagal in Australian Open: ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నాగల్ సంచలనం సృష్టించాడు. మూడేళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్
Sumit Nagal in Australian Open: టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. తన కెరీర్లో ఇది రెండోసారి కాగా.. మూడేళ్ల తర్వాత తొలిసారి సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అతడు ఆడబోతున్నాడు. శుక్రవారం (జనవరి 12) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో సుమిత్ మాజీ వరల్డ్ నంబర్ 38 అలెక్స్ మోల్కన్ ను ఓడించాడు.
ఈ మ్యాచ్ లో సుమిత్ నాగల్ 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో మోల్కన్ ను మట్టి కరిపించాడు. మెల్‌బోర్న్ పార్క్ లో ఈ మ్యాచ్ జరిగింది. 2021 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన టోర్నీలో సుమిత్ ఆడనుండటం ఇదే తొలిసారి. ఓవరాల్ గా అతడు తన నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడబోతున్నాడు. గతంలో 2019, 2010 యూఎస్ ఓపెన్, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తలపడ్డాడు.
సిట్సిపాస్‌ను ఓడించిన ప్లేయర్‌కు షాక్
ఇప్పుడు సుమిత్ నాగల్ ఓడించిన 25 ఏళ్ల అలెక్స్ మోల్కన్ గతేడాది స్టెఫనోస్ సిట్సిపాస్ ను ఓడించాడు. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన వరల్డ్ గ్రూప్ 1 డేవిస్ కప్ మ్యాచ్ లో సిట్సిపాస్ కు ఈ మోల్కన్ షాకిచ్చాడు. అలాంటి ప్లేయర్ ను ఇప్పుడు సుమిత్ ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ కు అర్హత సాధించడం విశేషం. రెండోసారి ఈ టోర్నీలో సుమిత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
సుమిత్ నాగల్ ప్రస్తుతం 139వ ర్యాంకులో ఉండగా.. మోల్కన్ 38వ స్థానంలో ఉన్నాడు. ఈ కీలకమైన మ్యాచ్ మొదటి సెట్ మొదట్లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన సుమిత్.. 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే తర్వాత పుంజుకున్న మోల్కన్.. సుమిత్ సర్వీస్ బ్రేక్ చేసి తన సర్వీసులు నిలుపుకుంటూ 3-3తో సమం చేశాడు. అయితే పదో గేమ్ లో మరోసారి సర్వీస్ బ్రేక్ చేసి సుమిత్ 6-4తో తొలి సెట్ గెలిచాడు.
ఈ తొలి సెట్ 51 నిమిషాల పాటు సాగింది. భుజం గాయానికి చికిత్స తీసుకుంటూనే మోల్కన్ తో సుమిత్ హోరాహోరీగా తలపడ్డాడు. రెండో సెట్లో 8వ గేమ్ లో తొలిసారి మోల్కన్ సర్వీస్ ను సుమిత్ బ్రేక్ చేశాడు. 5-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో తుంటిగాయానికి గురై కాసేపు చికిత్స తీసుకున్నాడు. అయితే వెంటనే కోలుకొని మళ్లీ గాడిలో పడిన సుమిత్.. 6-4తో రెండో సెట్ కూడా గెలిచి మ్యాచ్ లో విజయం సాధించాడు.
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 14న ప్రారంభం కానుంది. జనవరి 28 వరకూ ఈ టోర్నీ జరగనుంది. ప్రధాన టోర్నీ తొలి రౌండ్లో సుమిత్ కజకిస్తాన్ కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్ తో తలపడనున్నాడు.
టాపిక్