తెలుగు న్యూస్  /  Sports  /  South Africa Won By 49 Runs Against India In 3rd T20i

India vs South Africa: పరువు దక్కించుకున్న ప్రొటీస్.. మూడో టీ20లో భారత్‌పై ఘనవిజయం

04 October 2022, 22:50 IST

    • India vs South Africa 3rd T20I: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడిపోయింది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దినేశ్ కార్తీక్ ఒక్కడే 46 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
భారత్-సౌతాఫ్రికా
భారత్-సౌతాఫ్రికా (Twitter)

భారత్-సౌతాఫ్రికా

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదనలో బరిలోకి దిగిన రోహిత్ సేన..178 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ.. టీమిండియా పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. దినేశ్ కార్తీక్(46), దీపక్ చాహర్(31) మినహా మిగిలిన వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఫలితంగా సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లు తీయగా.. వేన్ పార్నెల్, లుంగి ఎంగిడీ, కేశవ్ మహారాజ్ తలో 2 వికెట్లు తీశారు. అయితే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్.. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

228 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. భారత్ పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డై డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. తదుపరి ఓవర్ వేసిన పార్నెల్ బౌలింగ్‌లో వన్డౌన్ బ్యాటర్ శ్రేయాస్(1) అయ్యర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇలాంటి సమయంలో రిషభ్ పంత్(27), దినేశ్ కార్తీక్(46) భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని లుంగి ఎంగిడి విడదీశాడు. పంత్‌ను ఔట్ చేయడంతో 41 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(8) సాయంతో కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు దినేశ్ కార్తీక్. ప్రమాదకరంగా మారుతున్న కార్తిక్‌ను కేశవ్ మహారాజ్ బౌల్డ్ చేయడంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ కాసేపటికే సూర్యకుమార్ యాదవ్‌ను ప్రిటోరియస్ ఔట్ చేయడంతో భారత్‌కు దెబ్బపై దెబ్బ తగిలిట్లయింది. అక్కడ నుంచి వికెట్ల పతనం వేగంగా మొదలైంది. ముందు హర్షల్ పటేల్‌ను(17) లుంగి ఎంగిడి ఔట్ చేయగా.. అనంతరం అక్షర్ పటేల్‌ను(9) పార్నెల్ పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రవిచంద్రన్ అశ్విన్‌ను(2) కేశవ్ మహారాజ్ వెనక్కి పంపాడు. అయితే ఇలాంటి సమయంలో దీపక్ చాహర్ కాసేపు నిలకడగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచాడు. అతడు17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే దూకుడు మీదున్న చాహర్‌ను ప్రిటోరియస్ ఔట్ చేయడంతో టీమిండియా చేతులెత్తేసింది. ముందు బౌలర్ల విఫలం, అనంతరం టాపార్డర్ వరుసగా పెవిలియన్ చేరడం, బ్యాటింగ్‌లో స్థిరత్వ లేమి కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 18.3 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలైటైంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రసో(100) సెంచరీతో అదరగొట్టగా.. ఓపెనర్ క్వింటన్ డికాక్(68) అర్ధశతకంతో రాణించాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్ చెరో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

<p>విజయానంతరం సంబురాలు చేసుకున్న దక్షిణాఫ్రికా</p>